ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Releases White Paper on AP's Financial Position

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రజల్లో వచ్చిన ఊహించని సైలెంట్ రివల్యూషన్‌కు నిదర్శనమని, ప్రజలు అందించిన విజయం బాధ్యతాయుత పాలనకు పునాది అని పేర్కొన్నారు. 1982, 1994ల తరహాలోనే 2024లోనూ కూటమి 94 శాతం స్ట్రయిక్ రేట్‌తో చారిత్రాత్మక విజయం సాధించిందని తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొన్న సవాళ్లు

రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తూ, బాధ్యతగల ప్రభుత్వంగా ప్రస్తుత ఆర్థిక వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారిందని, 58 శాతం జనాభా కలిగిన ఏపీకి కేవలం 46 శాతం వనరులు మాత్రమే దక్కాయని వివరించారు. గతంలో రెండు ప్రాంతాలను సమర్థవంతంగా అభివృద్ధి చేసినప్పటికీ విభజన అనంతరం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

గత ఐదేళ్ల పాలనపై విమర్శలు.. బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణ

గత ఐదేళ్లలో పాలన దెబ్బతినడంతో పాటు అధికారుల నైతిక స్థైర్యం సడలిందని, పలు పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం వల్ల ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్ ఆంధ్రాను పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమైందని, దీని ద్వారానే రాష్ట్ర ఆదాయం మళ్ళీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై విశ్లేషణ

తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై స్పందిస్తూ, విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 95,231 కాగా, విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ. 93,903కు పడిపోయి తెలంగాణతో పోలిస్తే రూ. 30,201 వ్యత్యాసం ఏర్పడిందన్నారు. 2014-19 మధ్యకాలంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, అనంతరం వైసీపీ హయాంలో అది 10.3 శాతానికి పడిపోయిందని తెలిపారు.

అప్పులు, ఆర్థిక నిర్వహణపై విమర్శలు

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మళ్ళీ వేగం పుంజుకుని 11.3 శాతం వృద్ధి రేటు సాధించినట్లు సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులు, లిక్కర్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టడం, అధిక వడ్డీలకు అప్పులు చేయడం వల్ల 2023-24లో నీతి ఆయోగ్ ‘జీరో డెట్ సస్టైనబిలిటీ’గా ప్రకటించిందని విమర్శించారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపులు, కేంద్ర పథకాల పునరుద్ధరణ

కేంద్ర పథకాల నిధులు మళ్లించడం, స్థానిక సంస్థల గ్రాంట్లు దారి మళ్లించడం వల్ల వ్యవస్థాగత సంక్షోభం వచ్చిందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రూ. 48,616 కోట్ల పెండింగ్ బిల్లుల్లో రూ. 29,259 కోట్లను చెల్లించి భారాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. రద్దయిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించి, వాటి ద్వారా రూ. 45,138 కోట్లు ఖర్చు చేయగలిగామని వివరించారు.

సంక్షేమానికి పెద్దపీట.. పారదర్శక పాలన

రాష్ట్రంలో సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇప్పటివరకు సంక్షేమ పథకాలపై రూ. 49,401 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహణ, మైనార్టీల సంక్షేమం, గనులు మరియు మద్యం షాపుల కేటాయింపుల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పాలన ద్వారా ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here