80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది వేడుకలను దానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
మువ్వన్నెల జెండా దేశ ప్రజల గర్వానికి ప్రతీక అని మోదీ అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రజలను కోరారు.
‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ప్రతి పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. అనంతరం జెండాతో తీసుకున్న సెల్ఫీ లేదా ఫొటోను harghartiranga.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.
దేశవ్యాప్తంగా జిల్లాలు, బ్లాకులు, పంచాయతీ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తిరంగా ర్యాలీలు, బైక్, సైకిల్ ర్యాలీలు, ప్రముఖ భవనాలను మువ్వన్నెల వెలుగులతో అలంకరించడం, సంగీత కార్యక్రమాలు, రంగోలి పోటీలు వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు.
తొలిసారిగా ‘సూర్యపథ్ తిరంగా’
ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా ‘సూర్యపథ్ తిరంగా’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
‘వందేమాతరం’తో దేశభక్తి చాటుకుందాం
‘తిరంగా సెల్యూట్ టు ది స్పిరిట్ ఆఫ్ వందేమాతరం’ అనే థీమ్‌తో భారీ స్థాయిలో ‘వందేమాతరం’ సమూహ గాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనితో పాటు ‘సెల్ఫీ విత్ తిరంగా’ కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు.
2022లో ప్రారంభమైన ‘హర్ ఘర్ తిరంగా’
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా 2022లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ జెండాతో ప్రతి పౌరుడికి వ్యక్తిగత అనుబంధాన్ని పెంపొందించడంతో పాటు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఇప్పటికే ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో తిరంగా యాత్రలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.








































