ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తన పాత మిత్రదేశమైన భారత్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు రష్యా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు రష్యా ఉప ప్రధాని మరట్ ఖుస్నులిన్ వెల్లడించారు. ఈ వివరాలను రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.
సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా రైల్వే కారిడార్
తుర్కియే నియంత్రణలోని బోస్ఫోరస్, ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి వంటి వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో తరచూ తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రష్యా కొత్త ప్రణాళికకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని రష్యా భావిస్తోంది.
భారత్‌తో అనుసంధానానికి ప్రత్యామ్నాయ మార్గం
తుర్క్‌మెనిస్థాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గంతో పాటు భారత్‌ను అనుసంధానించే ప్రత్యామ్నాయ రైల్వే కారిడార్‌ను రష్యా స్వాగతిస్తుందని తెలిపింది. ఈ మార్గం ద్వారా రష్యా నుంచి భారత్‌కు సరుకులను రవాణా చేయడానికి కొత్త అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
తగ్గనున్న రవాణా సమయం, వ్యయం
ప్రతిపాదిత రైల్వే కారిడార్ పూర్తయితే రష్యా-భారత్ మధ్య సరుకు రవాణాకు పట్టే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో ఈ కొత్త కారిడార్ కీలక మార్పులకు దారితీయవచ్చని రవాణా, ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రష్యా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ఏర్పడే సముద్ర రవాణా అంతరాయాలకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారే అవకాశం ఉంది.






































