పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హాలిసహర్‌లో ఓ టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమె కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు చుట్టుముట్టి రాళ్లు, ఇటుకలు, బురద, వాటర్ బాటిళ్లు విసిరినట్లు సమాచారం.
పోలీసులు భద్రత కల్పిస్తున్నప్పటికీ ఆందోళనకారులు వారిని దాటుకుని మమతా బెనర్జీ కాన్వాయ్ వైపు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి సమయంలో కొందరు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం.
‘ఇంతటి దాడిని ఎప్పుడూ ఎదుర్కోలేదు’
ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లెదుటే బయట నుంచి వచ్చిన సంఘవిద్రోహ శక్తులు తన కారుపై రాళ్లు, ఇటుకలు, బురద విసిరారని ఆరోపించారు. కారు కిటికీలు తెరిచి ఉంటే తనకు తీవ్ర గాయాలయ్యేవని, ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన రాజకీయ జీవితంలో ఇంతటి దాడిని ఎప్పుడూ ఎదుర్కోలేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తనను, తన వెంట ఉన్నవారిని కాపాడేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులు బీజేపీకి మాత్రమే రక్షణ కల్పిస్తున్నారని ఆమె విమర్శించారు.
టీఎంసీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మమత
పోలీసు కస్టడీలో మరణించిన టీఎంసీ కౌన్సిలర్ భర్త బిర్జు కియోత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ హాలిసహర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్‌పై ఈ దాడి జరిగినట్లు సమాచారం.
దాడిని ఖండించిన బీజేపీ
మమతా బెనర్జీపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఖండించింది. ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పరాజయం తర్వాత మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కూడా దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. కొద్ది నెలల వ్యవధిలోనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.







































