తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, ఆయన భార్య సంగీతకు సంబంధించిన విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సంగీత ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు ఈ కేసును అధికారికంగా ముగించింది. విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరైన సంగీత, తాను స్వచ్ఛందంగా పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కేసును క్లోజ్ చేసింది.
విజయ్-సంగీత దాంపత్య జీవితానికి సంబంధించిన ఈ వివాదం గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. 2026 ఫిబ్రవరి 24న చెంగల్పట్టు జిల్లా కోర్టులో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో వ్యక్తిగత కారణాలతో పాటు, భర్తకు ఓ సినీ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు మంజూరు చేయాలని కోరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే, తాజా విచారణలో సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో న్యాయపరంగా ఈ కేసుకు ముగింపు లభించింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి గల కారణాలపై సంగీత గానీ, విజయ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై ఆసక్తి నెలకొంది.
ఈ పరిణామంతో విజయ్‌పై కొనసాగుతున్న విడాకుల కేసు ముగియగా, ఇది ఆయనకు న్యాయపరంగా ఊరటనిచ్చే పరిణామంగా మారింది. అయితే పిటిషన్ ఉపసంహరణకు దారితీసిన పరిస్థితులపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.








































