ఏపీలో మద్యం రవాణా స్కాం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్‌

Former Minister Karumuri Nageswara Rao Detained by ED in Liquor Transport Scam

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కీలక చర్య చేపట్టింది. వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు.

మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించిన నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు రూ.400 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సిట్‌ పేర్కొనగా.. రూ.195.32 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు వెల్లడించింది.

మద్యం రవాణా ధర రూ.13 నుంచి రూ.34కు పెంపు

జగన్‌ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా విధానంలో కీలక మార్పులు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గతంలో జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల పరిధిలో ఉన్న మద్యం రవాణా వ్యవస్థను కేంద్రీకృతం చేసి, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహించేలా మార్పులు చేశారు.

ఈ క్రమంలో మద్యం డిపో నుంచి షాపులకు ఒక కార్టన్‌ రవాణా చేసే ధరను రూ.13 నుంచి రూ.34కు పెంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ‘సిగ్మా సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థకు ప్రధాన కాంట్రాక్టు అప్పగించి, వివిధ ప్రాంతాల్లో సబ్‌కాంట్రాక్టులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

కారుమూరి కుటుంబానికి నిధులు వెళ్లినట్లు ఈడీ గుర్తింపు

ఈడీ దర్యాప్తులో కారుమూరి కుటుంబానికి చెందిన సంస్థలు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. శ్రీ సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఖాతాల్లోకి రూ.68 కోట్లు, మాజీ మంత్రి ఖాతాలకు సుమారు రూ.15 కోట్లు, ఆయన కోడలు వల్లూరి కీర్తి ఖాతాల్లోకి రూ.9.5 కోట్లు వెళ్లినట్లు ఈడీ గుర్తించినట్లు వెల్లడైంది.

అలాగే కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్‌ ఖాతాలకు కూడా నిధులు మళ్లించినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.37.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ముగ్గురు అరెస్ట్‌

ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కీలక నిందితుడిగా పేర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డిలను ఈడీ ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం వారు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.

కారుమూరి నాగేశ్వరరావును కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన అనారోగ్య కారణాలు చూపి విచారణకు హాజరుకాలేదని అధికారులు పేర్కొన్నారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించకపోవడంతో తాజాగా ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

రూ.195.32 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు

మద్యం రవాణా ద్వారా వచ్చిన అక్రమ నిధులను నేరుగా ఖాతాల్లో ఉంచకుండా వివిధ మార్గాల్లో మళ్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. బోగస్‌ ఇన్వాయిస్‌లు, షెల్‌ సంస్థలు, నగదు లావాదేవీలు, భూముల కొనుగోలు కోసం అడ్వాన్సులు తదితర మార్గాల ద్వారా నిధులను లేయరింగ్‌ చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తంగా ఈ వ్యవహారంలో రూ.195.32 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ నిధులు ఎక్కడికి మళ్లాయి? ఎవరి ద్వారా పెట్టుబడులు పెట్టారు? మనీ ట్రయల్‌ ఎలా సాగింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేసిన ఈడీ.. తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here