రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Alleges Political Reasons Behind Denial of His US Visit

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ (MEA) రాజకీయ కారణాలతోనే అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోని బోస్టన్‌, న్యూయార్క్‌ నగరాల్లో పర్యటించి హార్వర్డ్‌, ఎంఐటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు ఆహ్వానించాలన్నదే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. విద్య, పరిశోధన, పెట్టుబడులు, యువత భవిష్యత్తు వంటి అంశాలపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

అధికారుల బృందం అమెరికాలోనే పర్యటన

తన అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోయినప్పటికీ.. అధికారుల బృందం మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అమెరికాలో పర్యటించనుందని సీఎం కార్యాలయం తెలిపింది. ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో విద్యా రంగ అభివృద్ధి, పరిశోధన, నైపుణ్యాల పెంపుపై చర్చించడంతో పాటు పలు ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది.

ఖర్గేకు, కాంగ్రెస్‌ నేతలకు కృతజ్ఞతలు

తనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు, పెట్టుబడుల సాధన వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన అంశంపై పూర్తి వివరాలను వెల్లడిస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here