హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్ ఛార్జీలు.. సెప్టెంబర్ 1 నుంచి అమలు

Hyderabad Airport To Levy UDF Charges On Arriving Passengers, Effective From Sep 1

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులపై విధించే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (UDF)లో మార్పులు చోటుచేసుకున్నాయి. విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (AERA) కొత్త ఛార్జీల షెడ్యూల్‌ను ప్రకటించింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ విమానాశ్రయంలో సవరించిన రుసుములు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి.

బయలుదేరే ప్రయాణికులకు ఛార్జీ తగ్గింపు

ఇప్పటివరకు విమానాశ్రయంలోని ట్రావెలేటర్లు, కన్వేయర్ బెల్టులు, ఏరోబ్రిడ్జిలు వంటి సదుపాయాల వినియోగానికి సంబంధించిన యూడీఎఫ్‌ను ప్రధానంగా బయలుదేరే ప్రయాణికుల నుంచే వసూలు చేస్తున్నారు. అయితే ఈ సదుపాయాలను విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఛార్జీల విధానాన్ని AERA సవరించింది.

కొత్త విధానం ప్రకారం దేశీయ విమానాల్లో బయలుదేరే ప్రయాణికుల యూడీఎఫ్ రూ.750 నుంచి రూ.515కు తగ్గనుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ ఫీజు రూ.1,500 నుంచి రూ.1,030కు తగ్గుతుంది.

దిగే ప్రయాణికులపై తొలిసారి UDF

ఇప్పటివరకు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగే ప్రయాణికులకు యూడీఎఫ్‌ విధించలేదు. తాజా సవరణలతో ఇకపై వారికి కూడా ఈ రుసుము వర్తించనుంది.

దేశీయ విమానాల్లో హైదరాబాద్‌లో దిగే ప్రయాణికులకు రూ.220, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.440 UDFగా వసూలు చేయనున్నారు. ఈ మొత్తం ప్రయాణికులు విడిగా చెల్లించాల్సిన అవసరం లేకుండా విమాన టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు.

2029 తర్వాత ఛార్జీల్లో మార్పులు

2026-27 నుంచి 2030-31 వరకు అమల్లో ఉండే నియంత్రణ కాలంలో UDF రుసుములను దశలవారీగా సవరించనున్నారు. దేశీయ బయలుదేరే ప్రయాణికులకు ప్రారంభ ఛార్జీ రూ.515గా ఉండగా, 2029లో కొంతకాలం రూ.670 వరకు పెరిగే అవకాశం ఉంది. అనంతరం నవంబర్ 2029 నుంచి బేస్‌లైన్ రుసుములో మరోసారి మార్పు ఉంటుంది.

దిగే దేశీయ ప్రయాణికులకు ప్రారంభ ఛార్జీ రూ.220 కాగా, తర్వాత దశలో ఇది రూ.285 వరకు పెరిగి, 2029 నవంబర్ నుంచి రూ.175కు సవరించనున్నారు.

అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలోనూ దశలవారీగా ఛార్జీల మార్పులు ఉండనున్నాయి. దిగే ప్రయాణికులకు ప్రారంభ రుసుము రూ.440గా ఉండి, అనంతరం రూ.500 వరకు చేరి, 2029లో రూ.375కు సవరించే విధానం ఉంది.

కొత్త టెర్మినల్ పూర్తయ్యాకే అదనపు ఛార్జీలు

హైదరాబాద్ విమానాశ్రయంలో కొనసాగుతున్న నార్తర్న్ రన్‌వే, నార్తర్న్ ప్రిసింక్ట్‌ (కొత్త టెర్మినల్) వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే అదనపు ఛార్జీల వసూళ్లకు AERA అనుమతి ఇచ్చింది.

ఈ అభివృద్ధి పనులు 2029 నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తే, ఆ తర్వాత నిర్దేశిత అదనపు రుసుములు ప్రయాణికులపై వర్తించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం బయలుదేరే ప్రయాణికులకు కొంత ఊరట లభించనుండగా.. హైదరాబాద్‌లో దిగే ప్రయాణికులకు మాత్రం తొలిసారిగా UDF భారం పడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here