కులగణనలో ‘ఓపెన్-ఎండెడ్’ వద్దు.. తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలి – కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ

Lop Rahul Gandhi and Congress Chief Kharge Urges PM Modi To Adopt Telangana Model For Caste Census

కులగణన నిర్వహణ విధానంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం వారు సుదీర్ఘ లేఖ రాశారు. కులాల నమోదులో ప్రస్తుత విధానాన్ని మార్చి, తెలంగాణలో అనుసరించిన నమూనాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కులగణనలో కులాల నమోదుకు కేంద్రం ప్రతిపాదించిన ‘ఓపెన్-ఎండెడ్’ విధానంపై ఇద్దరు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంతో ఒకే కులం ప్రాంతాలను బట్టి లేదా వేర్వేరు పేర్లతో నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా కులాల గణాంకాల్లో గందరగోళం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

‘ఓబీసీ’ పదం లేకపోవడంపై అభ్యంతరం

కులగణన ప్రశ్నావళిలో ‘వెనుకబడిన వర్గాలు’ లేదా OBCలకు స్పష్టమైన ప్రస్తావన లేకపోవడాన్ని రాహుల్ గాంధీ, ఖర్గే తప్పుబట్టారు. కులాల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలంటే ముందుగా స్పష్టమైన వర్గీకరణ విధానం ఉండాలని వారు సూచించారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగిస్తున్న విధానానికి అనుగుణంగా బీసీ, ఓబీసీ కులాల నమోదుకు కూడా ‘డ్రాప్‌డౌన్ లిస్ట్’ విధానాన్ని అమలు చేయాలని కోరారు. దీనివల్ల ఒకే కులం వివిధ పేర్లతో నమోదయ్యే అవకాశం తగ్గి, సేకరించిన సమాచారం మరింత విశ్వసనీయంగా ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణ, బిహార్ నమూనాలను ప్రధానికి పంపిన నేతలు

కులాల నమోదుకు సంబంధించి తెలంగాణలో 2024లో, బిహార్‌లో 2022లో అనుసరించిన విధానాలను రాహుల్, ఖర్గే ప్రస్తావించారు. ఆయా సర్వేల్లో ఉపయోగించిన కులాల జాబితాల నమూనాలను ప్రధాని మోదీకి పంపినట్లు తెలిపారు.

ప్రస్తుత ప్రశ్నావళిలో ఉన్న గందరగోళాన్ని తొలగించి, కొత్త విధానాన్ని రూపొందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు సంబంధిత రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపి, సమగ్రంగా కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని కోరారు.

కులాల గణనలో సరైన విధానం అవలంబించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు అవసరమైన గణాంకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here