వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం అందజేసింది. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.200 కోట్ల పరిహారం విలువైన చెక్కులను సీఎం అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాసితులు తమ ఆనందాన్ని ముఖ్యమంత్రి వద్ద వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు.
30 ఏళ్ల కల నెరవేరింది: నిర్వాసితులు
వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని ఇన్నేళ్లుగా ఎదురుచూశామని నిర్వాసితులు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కలగన్న ప్రాజెక్టును ఇప్పుడు పూర్తయిన దశలో చూడటం సంతోషంగా ఉందన్నారు.
తాము జీవించి ఉండగా ప్రాజెక్టును చూస్తామా లేదా అనే అనుమానం కూడా గతంలో ఉండేదని, ఇప్పుడు ఆ కల సాకారం కావడంతో భావోద్వేగానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం అందించిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు.
ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమం కూడా ముఖ్యం: నిమ్మల
వెలిగొండ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే అప్పటి ప్రభుత్వం దానిని జాతికి అంకితం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన సుమారు రూ.900 కోట్ల పరిహారంలో గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు.
వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో.. నిర్వాసితుల పునరావాసం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం కూడా అంతే ముఖ్యమని నిమ్మల స్పష్టం చేశారు.
నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన మొత్తం 7 పునరావాస కాలనీల్లో నాలుగు కాలనీల్లో మౌలిక వసతుల పనులు పూర్తిగా పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన మూడు కాలనీల్లోనూ పనులను వేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
మిగిలిన రూ.400 కోట్లు త్వరలో చెల్లిస్తాం: డోలా
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా చెల్లించాల్సిన రూ.400 కోట్ల పరిహారాన్ని త్వరలోనే అందిస్తామని సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
ఈ ఆగస్టులోనే నల్లమల్ల సాగర్‌కు నీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. గత పాలనలో నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఆరోపించిన మంత్రి.. పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్టుకు గతంలో శంకుస్థాపన చేసిన చంద్రబాబే ఇప్పుడు దాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తున్నారని అన్నారు.
ప్రాజెక్టు పూర్తితో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి సహకరించి, గ్రామాలను ఖాళీ చేయాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి విజ్ఞప్తి చేశారు.






































