దేశవ్యాప్తంగా చట్టపరమైన, పరిపాలన, డిజిటల్, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నింటికీ భారత ప్రామాణిక సమయం (IST)ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) రూల్స్-2026’ పేరుతో కొత్త నిబంధనలను విడుదల చేసింది. అధికారిక గెజిట్‌లో ఈ నిబంధనలు ప్రచురించిన 180 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.
‘వన్ నేషన్.. వన్ టైమ్’ విధానానికి శ్రీకారం
దేశవ్యాప్తంగా అన్ని కీలక వ్యవస్థల్లో ఒకే ప్రామాణిక సమయాన్ని అమలు చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, టెలికాం, రైల్వేలు, విమానయానం, పవర్ గ్రిడ్స్ వంటి రంగాల్లో వేర్వేరు సమయ సూచికలు, వ్యవస్థలు వినియోగంలో ఉన్నాయి. దీంతో డేటా రికార్డింగ్, లావాదేవీల టైమ్ స్టాంపింగ్‌లో వ్యత్యాసాలు ఏర్పడి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
కొత్త నిబంధనల ద్వారా దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్.. వన్ టైమ్’ విధానాన్ని అమలు చేసి అన్ని కార్యకలాపాల్లో సమయ సమన్వయాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటల్ సేవల్లో మరింత కచ్చితమైన టైమ్ స్టాంపింగ్
ఏకీకృత IST వ్యవస్థ అమలుతో బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ పేమెంట్లు, టెలికాం సేవలు, రైల్వేలు, విమానయానం వంటి రంగాల్లో సమయ వ్యత్యాసాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలకు అత్యంత కచ్చితమైన టైమ్ స్టాంపింగ్ అందుబాటులోకి రావడంతో డేటా సమన్వయం మరింత మెరుగుపడనుంది.
విదేశీ వ్యవస్థలపై ఆధారాన్ని తగ్గించనున్న భారత్
ప్రస్తుతం దేశంలోని కొన్ని టెలికాం, ఇంటర్నెట్ సేవల వ్యవస్థలు సమయ సమన్వయం కోసం అమెరికాకు చెందిన GPS వంటి విదేశీ ఉపగ్రహ వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. కొత్త నిబంధనల అమలుతో విదేశీ వ్యవస్థలపై ఆధారాన్ని తగ్గించి, భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘నావిక్’ (NavIC) శాటిలైట్ నేవిగేషన్ వ్యవస్థను మరింత విస్తృతంగా వినియోగించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.
దేశంలో డిజిటల్ మౌలిక వసతులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, అన్ని రంగాల్లో ఒకే ప్రామాణిక సమయ వ్యవస్థను అమలు చేయడం ద్వారా సాంకేతిక స్వావలంబనతో పాటు పరిపాలనా సామర్థ్యాన్ని కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.






































