వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu Offers Silk Robes To Lord Venkateswara During Brahmotsavams at Tirumala

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలిసి పట్టువస్త్రాలను వెండి పళ్లెంలో శిరస్సుపై ధరించి మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు.

అలాగే సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎంకు ప్రత్యేక ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీవారి పెద్దశేష వాహన సేవలో సీఎం కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం చంద్రబాబుకు ఇది 15వసారి కావడం విశేషం.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న టీటీడీ పాలకమండలి, అధికారులను అభినందించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచి అభివృద్ధిలో ముందుకు సాగేందుకు శ్రీవారి దివ్యానుగ్రహం ఉండాలని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here