మంత్రి కొండా సురేఖకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. బర్తరఫ్ కోసం గవర్నర్‌కు లేఖ

CM Revanth Reddy Recommends Telangana Governor For Konda Surekha’s Removal as Minister

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక మలుపు తీసుకుంది. సురేఖ రాజీనామా చేస్తారా? లేక ప్రభుత్వమే ఆమెను బర్తరఫ్ చేస్తుందా? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

కొండా సురేఖ

హైకమాండ్‌ ఆమోదం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేస్తూ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాకు లేఖ పంపారు. రాజీనామా చేయాలని సూచించినప్పటికీ సురేఖ అందుకు అంగీకరించకపోవడంతో.. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు సీఎం సిఫారసు చేసినట్లు సమాచారం. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చిన్నారెడ్డిపై కూడా చర్యలు

మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది.

అదే సమయంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ జరిగింది

అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన ఈ వివాదం తొలుత సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న సుస్మిత, రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని సీఎం ప్రకటించడాన్ని తప్పుపట్టారు.

అభ్యర్థులను ప్రకటించే అధికారం రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించిన ఆమె, సీఎం సోదరుడి కంపెనీకి కేటాయించిన భూములపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ బహిరంగంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేయడం, దానికి స్పందిస్తూ సురేఖ తన కుమార్తె స్వతంత్రురాలని, ఆమె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పడం జరిగాయి.

ఈ నేపథ్యంలోనే అంతర్గత క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో చివరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి కొండా సురేఖను తొలగిస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా కొండా సురేఖ వ్యవహారంతో పాటు చిన్నారెడ్డిపై చర్యలు, కొత్త నియామకాలు తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ వేడిని పెంచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here