పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Released Godavari Waters To North Andhra Through Polavaram Left Canal

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసింది. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన కీలక ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం నమోదైంది.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కాలువపై నిర్మించిన రెగ్యులేటర్‌ను ప్రారంభించి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి విడుదల చేశారు.

పాయకరావుపేటలో చారిత్రక ఘట్టం

ఈ ఏడాదిలోనే అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు తీసుకొస్తామని గతంలో సంకల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాయకరావుపేట వద్ద గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించడం రాష్ట్ర జలవనరుల రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

నాలుగు నదులు, తూర్పు కనుమలు దాటుకుని గోదావరి పరుగులు

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ప్రస్తుతం విడుదల చేస్తున్న గోదావరి జలాలు సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను దాటుకుంటూ ఉత్తరాంధ్ర వైపు ప్రవహిస్తున్నాయి. పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదీ ప్రవాహాలను అధిగమిస్తూ, ఏలేరు కాలువ మరియు తూర్పు కనుమల ప్రాంతాల మీదుగా గోదావరి జలాలకు ప్రత్యేక మార్గాన్ని నిర్మించారు.

ఈ భారీ ఇంజినీరింగ్ నిర్మాణంలో భాగంగా పలు నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు, అక్విడెక్టులను జలవనరుల శాఖ నిర్మించింది. కొన్ని ప్రాంతాల్లో నదీ ప్రవాహాలకు ఎగువన, మరికొన్ని చోట్ల నదీ ప్రవాహాల దిగువ నుంచి పోలవరం ఎడమ కాలువను నిర్మించారు.

భారీ వ్యయంతో ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం

పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్లను ఖర్చు చేసింది. ఏలేరు నది బెడ్ లెవల్‌కు దిగువన గోదావరి జలాలను తరలించేందుకు ప్రత్యేక సైఫన్ నిర్మాణం చేపట్టారు.

పంపా నదిపై అక్విడెక్ట్ నిర్మాణం కూడా ఇంజినీరింగ్ పరంగా అత్యంత కీలకంగా నిలిచింది. ఈ నిర్మాణానికి 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదులు వేసి అక్విడెక్ట్‌ను నిర్మించారు. దీని ద్వారా పంపా నది ఎగువ నుంచి పోలవరం ఎడమ కాలువలో గోదావరి జలాల ప్రయాణానికి మార్గం సుగమమైంది.

తాండవ నదిపై భారీ అక్విడెక్ట్

తాండవ నదిపై కూడా భారీ అక్విడెక్ట్‌ను నిర్మించారు. 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా ఆరు వెంట్లతో 447 మీటర్ల పొడవున ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఇలాంటి అత్యాధునిక నిర్మాణాల ద్వారా గోదావరి జలాలను వివిధ నదీ ప్రవాహాలు, కొండ ప్రాంతాలను దాటిస్తూ ఉత్తరాంధ్రకు తరలించే అవకాశం ఏర్పడింది.

లక్షలాది మందికి ప్రయోజనం

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి వల్ల నాలుగు జిల్లాల పరిధిలోని సుమారు 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే దాదాపు 5.23 లక్షల మంది ప్రజలకు తాగునీటి ప్రయోజనం చేకూరనుంది.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో ఈ కార్యక్రమం కీలక అడుగుగా నిలిచింది. భవిష్యత్తులో ఈ కాలువ వ్యవస్థను మరింత విస్తరించి ఉత్తరాంధ్రలో సాగు, తాగునీటి అవసరాలకు దీర్ఘకాలిక పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

కాగా, రెండురోజుల క్రిందట ప్రకాశం జిల్లాలోని ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్’ మొదటి ఫేజ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, నేడు అనకాపల్లికి పోలవరం నుండి గోదావరి జలాలను విడుదల చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం నుంచి బయలుదేరిన గోదావరి జలాలు నదులు, కొండలు, సంక్లిష్ట నిర్మాణాలను అధిగమిస్తూ ఉత్తరాంధ్రకు చేరుకోవడం రాష్ట్ర జలవనరుల రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here