ఉత్తరాంధ్ర రైతాంగానికి, ప్రజలకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్‌ను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. అనంతరం జల హారతి ఇచ్చి కృష్ణా-గోదావరి జలాల తరహాలో ఈ జలాలకు ఘనంగా స్వాగతం పలకనున్నారు.
సాగు, తాగునీటికి భారీ ప్రయోజనం
పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదలయ్యే గోదావరి జలాలతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు కలగనున్నాయి. వివిధ ఆయకట్టు పరిధిలో సుమారు 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది.
ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.4,192 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కాలువను నిర్మించారు. ప్రస్తుతం విడుదలయ్యే జలాలతో ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది.
క్లిష్టమైన ప్రాంతాల్లో ఇంజినీరింగ్ అద్భుతాలు
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం అంత సులభంగా సాగలేదు. తూర్పు కనుమలు, కొండ ప్రాంతాలు, పలు నదీ ప్రవాహాలను దాటుకుంటూ కాలువ నిర్మాణ పనులను చేపట్టారు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటేందుకు సైఫన్లు, అక్విడెక్టులను నిర్మించారు.
ఏలేరు నది బెడ్ లెవల్‌కు దిగువ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సైఫన్ నిర్మించారు. పంపా నదిపై ఎగువ నుంచి అక్విడెక్ట్ నిర్మించారు. ఈ అక్విడెక్ట్‌కు 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదులు ఏర్పాటు చేశారు.
తాండవ నదిపై 447 మీటర్ల పొడవుతో, ఆరు వెంట్లతో అక్విడెక్ట్ నిర్మించారు. ఇది 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించారు.
110 చెరువులకు గోదావరి జలాలు
పాయకరావుపేట అక్విడెక్ట్ నుంచి విడుదల చేసే నీటిని అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువతో పాటు 110 చెరువులను నింపేలా కార్యాచరణ రూపొందించారు. పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ఏలేరు ఆయకట్టు కింద 80,700 ఎకరాల స్థిరీకరణకు నీటి వసతి కల్పించనున్నారు.
అలాగే పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాలు, తాండవ, వరాహ, మామిడి గెడ్డ పరిధిలో 46,620 ఎకరాలకు నీటి ప్రయోజనం కలగనుంది.
23.44 టీఎంసీల గోదావరి జలాల వినియోగం
పోలవరం ఎడమ కాలువ ద్వారా మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలను సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. దీని ద్వారా ఉత్తరాంధ్రలో నీటి కొరతను కొంతమేర తగ్గించడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతం లభించనుంది.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు అధికారులు తెలిపారు. భూ సేకరణ, పునరావాస సమస్యలను పరిష్కరించడంతో కాలువ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం
పోలవరం ఎడమ కాలువను భవిష్యత్తులో ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ అనుసంధానం పూర్తయితే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంటుంది.
పోలవరం ఎడమ కాలువ-ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనుసంధానం ద్వారా భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర వ్యవసాయం, తాగునీరు, పారిశ్రామిక రంగానికి గోదావరి జలాలు కీలక ఆధారంగా మారనున్నాయి.








































