తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను ఎలాంటి వివరణ అడగకుండా, తన వాదన వినకుండానే పదవి నుంచి తొలగించడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికి సైతం చివరిసారిగా తన మాట చెప్పుకునే అవకాశం ఉంటుందని, తనకు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెందుకు శిక్షించారు?
తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం ఏంటని కొండా సురేఖ ప్రశ్నించారు. ఆమె అభిప్రాయాలతో తనకు సంబంధం ఏమిటని కాంగ్రెస్ పెద్దలను నిలదీశారు. రాజీనామా చేయాలని చెప్పి ఉంటే తాను రాజీనామా చేసేదాన్నని, ముందుగా తన వివరణ తీసుకుని ఆ తర్వాత చర్యలు తీసుకుంటే బాగుండేదని అన్నారు. తాను నిజంగా తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
మంత్రులు బయటకు వచ్చి మాట్లాడాలి
మంత్రి పదవి తనకు కేవలం ఆభరణం మాత్రమేనని, కారణం చెప్పకుండా పదవి నుంచి తొలగించడం బాధాకరమని సురేఖ అన్నారు. గతంలో తాను స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. ప్రస్తుతం మంత్రులు సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని గుండెపై చేయి వేసుకుని చెప్పాలని, మంత్రులంతా బయటకు వచ్చి మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
పనులు చేయించుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. తాను పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఏమీ అనలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో తనపై కుట్ర జరిగిందన్న సురేఖ
తనకు ఎవరి అండ లేకుండానే రాజకీయాల్లో ఎదిగామని కొండా సురేఖ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులే పార్టీపై, అగ్రనేతలపై విమర్శలు చేసిన సందర్భాలను ఆమె ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిన వారికి సైతం పదవులు ఇచ్చి గౌరవించారని వ్యాఖ్యానించారు.
తనను బర్తరఫ్ చేయాలనే ఆలోచన మొదట ఏఐసీసీకి లేదని, బ్లాక్‌మెయిల్ రాజకీయాల కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని సురేఖ ఆరోపించారు. వేం, పొంగులేటి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏకమై తనను ఇబ్బంది పెట్టారని ఆమె పేర్కొన్నారు.
మాజీ ఓఎస్డీ వ్యవహారంపై ఆరోపణలు
తన మాజీ ఓఎస్డీ సుమంత్ విషయంలోనూ ప్రభుత్వం తీరుపై సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమంత్ పేరును ఉపయోగించుకుని కిరణ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. డబ్బులు వసూలు చేసిన వ్యక్తే సుమంత్‌పై కేసు పెట్టాడని ఆమె పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంలో తమవారినే ఇబ్బంది పెట్టుకోవడం చరిత్రలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించిన సురేఖ.. సుమంత్‌ను ఇబ్బంది పెట్టడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వంలో మార్పులు రావాలి
కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిన, మార్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని కొండా సురేఖ అన్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే చాలా మార్పులు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మోనోపాలీ తరహాలో పాలన సాగించడం సరికాదని, ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకునే సమయంలో అందరితో చర్చించాలని సూచించారు.
తాను ఇక ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని సురేఖ స్పష్టం చేశారు. అయితే పార్టీలో తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. తన కుమార్తె వ్యాఖ్యలను తాను ఖండిస్తే ఆమెను కించపరిచినట్లు అవుతుందని అన్నారు.
తప్పు చేయకుండా బర్తరఫ్ చేయడం పార్టీ తప్పు
మంత్రి పదవి నుంచి తొలగించడం తనకు అవమానంగా అనిపించడం లేదని కొండా సురేఖ చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే చర్యలకు బాధ్యత వహించేదాన్నని, కానీ తప్పు చేయకుండా బర్తరఫ్ చేయడం పార్టీ చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య తేడా ఉందంటూ కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజా వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.








































