తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్నారు. ఆదివారం ఎర్రవెల్లిలో మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది.
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈ అంశంతో పాటు ప్రభుత్వ పాలనా తీరుపై సమీక్ష, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎలా ప్రశ్నించాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రస్తావించాలనే దానిపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందు జరుగుతున్న ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా శాసనసభలో బీఆర్ఎస్ అనుసరించబోయే కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.









































