తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే అసెంబ్లీ వెలుపల బీఆర్‌ఎస్, లోపల బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో హైటెన్షన్ పరిస్థితులు కనిపించాయి.
కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టు
గన్‌పార్క్ నుంచి ర్యాలీగా వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్టులు ధరించి, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నేతలు రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని సూచించింది.
22ఏ భూములపై బీజేపీ ఆందోళన, వాయిదా తీర్మానం
మరోవైపు అసెంబ్లీ లోపల కూడా బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలతో గందరగోళం నెలకొంది. 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ చేపట్టాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
సభకు సహకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీజేపీ సభ్యులను కోరారు. బీఏసీలో నిర్ణయం తీసుకున్న అనంతరం 22ఏ అంశంపై చర్చించవచ్చని స్పష్టం చేశారు. అయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల భూములు, ఇళ్లను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి ఈ వాయిదా తీర్మానం అందజేశారు.
చర్చకు ప్రభుత్వం సిద్ధమన్న మంత్రులు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 22ఏ అంశంపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారని తెలిపారు. సభా కార్యక్రమాలు నిబంధనల ప్రకారం కొనసాగాలని కోరారు. బీఏసీలో నిర్ణయం తీసుకుని 22ఏపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సహకరించాలని కోరారు.
అయితే భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
కాళేశ్వరంపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, విచారణ జరపాలని ఏడాది క్రితమే లేఖ రాశామని తెలిపారు.
కాళేశ్వరం అంశంపై విచారణను బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కై అడ్డుకుంటున్నాయని మంత్రి ఆరోపించారు. సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై విచారణ జరగకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ నిరసనల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయంగా వేడెక్కింది.








































