ఏపీలో కొత్త పింఛన్లు.. నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ

AP Govt Announces New NTR Bharosa Pensions, Applications Accepted From Today Till September 16

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం (సెప్టెంబర్‌ 7) నుంచి ప్రారంభమైంది. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోగా స్వర్ణ గ్రామ, వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీలు, అర్హుల ఎంపిక తదితర ప్రక్రియను సెప్టెంబర్‌ 26 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పలు వర్గాలకు కొత్త పింఛన్లు

రాష్ట్రంలో ఇప్పటికే 61,92,396 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.2,693 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా అర్హత సాధించే వారికి కూడా పింఛన్లు మంజూరు చేయనున్నారు.

పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్‌ వర్గాలకు చెందిన అర్హులకు కొత్త పింఛన్లు అందనున్నాయి.

సెప్టెంబర్‌ 16 వరకు దరఖాస్తులు

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు స్వీకరిస్తారు. అనంతరం సెప్టెంబర్‌ 17 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారుల వివరాలు, ధ్రువీకరణ పత్రాలు, సాధారణ అర్హతలు, ఇప్పటికే ఉన్న పింఛన్‌దారుల డేటాబేస్‌, ఈ-కేవైసీ తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తారు.

వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు లేదా వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలిస్తారు. అవసరమైన వారికి ఈ-కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు.

24లోగా అర్హుల ఎంపిక

క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అధికారులు దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారుల లాగిన్‌లలో అప్‌లోడ్‌ చేస్తారు. సెప్టెంబర్‌ 24లోగా అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల దరఖాస్తులను ఎంపీడీవో లేదా మున్సిపల్‌ కమిషనర్‌ పరిశీలిస్తారు. ఒంటరి మహిళల దరఖాస్తులను తహసీల్దార్‌ స్థాయిలో పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులకు పంపిస్తారు.

అదేవిధంగా చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల దరఖాస్తులను సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి తదుపరి ప్రక్రియ కోసం పంపిస్తారు.

తుది నిర్ణయం సెర్ప్‌దే

దరఖాస్తుదారుల అర్హత లేదా అనర్హతను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తదితర అధికారులు నిర్ణయిస్తారు. అయితే పింఛన్‌ మంజూరు చేసే తుది అధికారం వారికి ఉండదు. రాష్ట్రస్థాయిలో ఎస్‌జీఎస్‌డబ్ల్యూ, ఆర్టీజీఎస్‌, సెర్ప్‌ సంస్థలు దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి తుది ఆమోదం ఇస్తాయి.

అనర్హులుగా తేలిన దరఖాస్తుల వివరాలను కారణాలతో సహా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అర్హత సాధించిన వారి వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు సంబంధిత దరఖాస్తుదారులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారు.

సెర్ప్‌ ఉత్తర్వుల తర్వాత పింఛన్‌ పంపిణీ

సెర్ప్‌ తుది ఉత్తర్వులు జారీ చేసిన నెల నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా దరఖాస్తుల స్వీకరణ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల ఎంపిక, తుది ఆమోదం వరకు మొత్తం ప్రక్రియను సెప్టెంబర్‌ 26 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్‌ రూపొందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here