తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి దాటినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో బుధవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు.
తిరుమల కొండపై సహజ మరణం పొందిన భక్తుడి కుటుంబానికి రూ.2 లక్షలు అందించనున్నారు. ఆలయాల పరిధిలో ఇలాంటి గ్రూప్ బీమా విధానాన్ని దేశంలోనే తొలిసారిగా టీటీడీ అమలు చేస్తోందని బీఆర్ నాయుడు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తులకు ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల బీమాను రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన రూ.17 లక్షల ప్రీమియం మొత్తాన్ని టీటీడీ భరించనుంది. ఈ మేరకు ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
సీఎం చంద్రబాబు సమక్షంలో 15న ఎల్‌ఐసీతో ఎంవోయూ
భక్తులకు బీమా అందించే విధానంపై టీటీడీ దాదాపు ఆరు నెలలకు పైగా కసరత్తు చేసింది. అలిపిరి దాటినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు సుమారు మూడు రోజుల పాటు పాలసీ వర్తిస్తుంది. తిరుమలలో సహజ మరణం సంభవిస్తే అశ్విని ఆస్పత్రి ధ్రువీకరణ అనంతరం బీమా మొత్తాన్ని అందిస్తారు. సర్వదర్శనం భక్తులకు గ్రూప్ పాలసీ ద్వారా, ఇతర దర్శనాల భక్తులకు నేరుగా బీమా సొమ్ము అందించేలా విధానం రూపొందించారు.
ఈ పథకం కోసం టీటీడీ దాదాపు రూ.3 కోట్లను రివాల్వింగ్ ఫండ్‌గా ఎల్‌ఐసీలోని ప్రత్యేక ఖాతాలో జమ చేయనుంది. ఈ నెల 15న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీ, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ జరగనుంది.
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
ఈ నెల 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 16న రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 విద్యుత్ బస్సులతో పాటు ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. దేశంలోని 25 రాష్ట్రాలతో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కళాకారులు వాహన సేవల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం తిరుమల జలాశయాల్లో 120 రోజుల అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందని బీఆర్ నాయుడు వెల్లడించారు.
వ్యర్థాల నుంచి బయోగ్యాస్.. మరిన్ని లడ్డూలు
తిరుమల హోటళ్లు, అన్నప్రసాద భవనం నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభజించి వాటర్ హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేసేందుకు ఐవోసీఎల్ ముందుకొచ్చింది. రూ.2.80 కోట్లతో ప్లాంట్ నిర్వహణను జీపీఎస్ రెన్యువబుల్స్‌కు అప్పగించేందుకు అంగీకారం కుదిరింది.
శ్రీవారి పోటులో లడ్డూల తయారీని వేగవంతం చేసేందుకు మరో 400 మంది వర్కర్లను నియమించేందుకు ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. చెన్నైలోని అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి రూ.17.05 కోట్లతో బంగారు తాపడం చేయనున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్
శ్రీవారి వైభవాన్ని భక్తులకు సరికొత్త అనుభూతిగా అందించేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కంపార్టుమెంట్ నం.17లో త్రీడీ, వీఆర్ టెక్నాలజీతో దీనిని రూపొందిస్తున్నారు. ఈ నెల 15న సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభించనున్నారు. అలాగే గదుల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు రూపొందించిన ‘నందకం’ యాప్‌ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు.








































