‘వాటర్‌ మాన్’ కథనం.. సంతోషం కలిగించింది – సీఎం చంద్రబాబు

CM Chandrababu Delighted of CEO CM To Water Man Story About Him

‘వాటర్‌ మాన్’ కథనం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన గురువారం రాజధాని అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీపై ఎక్కువగా దృష్టి సారించే సీఎంగా ముద్రపడిన చంద్రబాబుపై ఇటీవల తన ప్రాధాన్యాలను విస్తృతం చేయడం గురించి, అందునా ప్రత్యేకించి రాష్ట్రంలో అనేక సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులను పూర్తిచేయడం (ఉదా: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల)పై ఒక ప్రముఖ జాతీయ మీడియా ప్రత్యేక కథనం (‘సీఈఓ సీఎం’ కాదు.. ‘వాటర్ మ్యాన్’) ప్రచురించడం తెలిసిందే.

ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పాలనలో వేగం పెంచడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన రాష్ట్ర ప్రగతి, నాయకత్వం, ఆర్థిక వ్యవస్థ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, జిల్లాల ఉత్తమ విధానాలపై విస్తృతంగా సమీక్షించారు.

సంక్షేమం కోసం రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధి కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వివరించారు. ప్రాంతీయ అభివృద్ధికి రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్‌కు కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేలా..

హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి రాజధానిని గుంటూరు, విజయవాడతో అనుసంధానించామని చెప్పారు. తన పాలనలో చేపట్టిన నీటి భద్రత, సంరక్షణ చర్యల నేపథ్యంలో తనను ‘వాటర్‌మ్యాన్’గా అభివర్ణిస్తూ వచ్చిన కథనం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉందని సీఎం తెలిపారు. ఆయా ప్రాంతాలకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు.

గోదావరి, కావేరీ, మహానది, గంగా వంటి నదులను అనుసంధానించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారతదేశ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నీటి భద్రత, సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.

ఇప్పటికే 36 ప్రాజెక్టులకు సంబంధించి క్యాలెండర్ ఇచ్చామని, నిర్దేశించిన సమయంలో వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలు ఒక్కరి వల్లే సాధ్యం కాలేదని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం కారణంగానే సాధ్యమయ్యాయని తెలిపారు. ఇది టీమ్ సక్సెస్ అని చంద్రబాబు అభివర్ణించారు.

అన్ని శాఖల్లో సంస్కరణలు

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రతి శాఖలో సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం చెప్పారు. మద్యం విక్రయాల్లో పారదర్శకత తీసుకొచ్చామని, విద్యుత్ టారిఫ్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి నెలా ఆర్థిక నివేదిక విడుదల చేస్తూ లక్ష్యాల సాధనపై సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ప్రతి మూడు నెలలకు జీఎస్‌డీపీ వృద్ధిని కూడా పరిశీలిస్తున్నామని వివరించారు. 2022-23ను బేస్ ఇయర్‌గా తీసుకుని ప్రస్తుత ధరల ప్రకారం 13.44 శాతం వృద్ధి రేటు నమోదైందని పేర్కొన్నారు. జీఎస్టీ వసూళ్లు కూడా గతేడాదితో పోలిస్తే రూ.25,450 కోట్లు పెరిగాయని తెలిపారు.

టెక్నాలజీతో వేగవంతమైన పాలన

రాష్ట్రంలో వనరులు, టెక్నాలజీ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నాయకత్వ లోపం కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

డీప్‌టెక్ గవర్నెన్స్, డేటా లేక్, అవేర్ వంటి సాంకేతిక వ్యవస్థలను వినియోగించి నిర్ణయాలు తీసుకునే వేగాన్ని పెంచాలని సూచించారు. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవల్లో నాణ్యతను మెరుగుపరచాలని అన్నారు. గతంలో 50 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని ఇప్పుడు 10 నుంచి 15 ఏళ్లలోనే సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రియాక్టివ్ గవర్నెన్స్‌కు బదులుగా ప్రో యాక్టివ్ గవర్నెన్స్ ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే అభివృద్ధి, పాలన కూడా పెండింగ్‌లో ఉన్నట్లేనని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందినప్పుడే సానుకూల స్పందన వస్తుందని అన్నారు.

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నీటి భద్రత సవాలుగా మారిందని, రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని సీఎం గుర్తు చేశారు.

కేంద్రం ప్రోత్సాహం, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ రైల్వే కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం అందించిందని చంద్రబాబు తెలిపారు. రేణిగుంట-అరక్కోణం మార్గంలో 3, 4వ రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

రూ.1,157 కోట్ల వ్యయంతో ఏపీ పరిధిలో 46 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం కలగడంతో పాటు రైళ్ల రద్దీ తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీ రైల్వే మౌలిక వసతులకు మద్దతు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఈ సందర్భంగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here