ఫాంహౌస్‌ కేంద్రంగానే కుట్రలు – బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

CM Revanth Reddy Alleges Conspiracy at BRS Chief KCR’s Farmhouse to Disrupt Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కుట్ర పన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉసిగొల్పి సభలో గందరగోళం సృష్టించారని విమర్శించారు. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అవమానించేలా వ్యవహరించడం, అధికారులపై దాడులు చేయడం వంటి పరిణామాలు పథకం ప్రకారమే జరిగాయని అన్నారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు ఆయన తల్లిని సైతం అవమానించారని సీఎం మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ.. సభ సజావుగా సాగకుండా బీఆర్‌ఎస్‌ అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. విద్యా రంగం, ధరణి అక్రమాలు, 22ఏ భూముల అంశం సహా పలు విషయాలపై చర్చ జరగాల్సి ఉందని, ఈ చర్చలు జరిగితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే కుట్రకు పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి అన్నారు.

దళితులు నిరసన తెలిపితే తప్పేంటి?

ఫాంహౌస్‌ వద్ద డప్పు చప్పుళ్లతో నిరసన తెలిపేందుకు వెళ్లిన దళిత సంఘాల ప్రతినిధులపై జరిగిన పరిణామాలను కూడా సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం వంటి చర్యలు అత్యంత అవమానకరమైనవని వ్యాఖ్యానించారు.

దళితులు, ఆదివాసీలు, మహిళలు సహా అన్ని వర్గాల గౌరవాన్ని కాపాడటమే రాజ్యాంగ స్ఫూర్తి అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో కుల, జాతి వివక్షకు తావిచ్చేలా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌ అగ్రనేత మల్లికార్జున ఖర్గే విషయంలోనూ ఇలాంటి వివక్షాపూరిత చర్యలు జరిగాయని ఆయన ప్రస్తావించారు.

ఘటనలపై సమగ్ర దర్యాప్తు

ఫాంహౌస్‌లో జరిగినట్లు ఆరోపిస్తున్న కుట్ర నుంచి అనంతరం చోటుచేసుకున్న అన్ని పరిణామాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కేసుల దర్యాప్తు బాధ్యతలను హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులపై దాడులు, మహిళా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడం, సభాపతిని అవమానించడం వంటి ఘటనల్లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కుట్రకు ప్రణాళిక రచించిన వారితో పాటు దానిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా వర్తించే చట్టాల ప్రకారం విచారణ జరిపి, బాధ్యులను శిక్షిస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి

సభాపతి పట్ల జరిగిన అవమానంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పందించి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ.. వ్యక్తిగత దూషణలు, కుల వివక్ష, రాజ్యాంగ పదవుల అవమానానికి తావు ఉండకూడదని పేర్కొన్నారు.

తెలంగాణ సమాజంలో అశాంతి, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here