22-ఏ జాబితా కొత్తగా వచ్చింది కాదు, కేసీఆర్‌ హయాంలో తీసుకొచ్చిందే – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Says, 22A Land List Dates Back To KCR Govt Era

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూ వ్యవహారాలను కూడా సభలో చర్చకు తీసుకురావాలని అన్నారు.

అసెంబ్లీ కమిటీ హాల్లో గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్‌రెడ్డి శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

22ఏ జాబితాపై వాస్తవాలు చెప్పాలి

22ఏ నిషేధిత భూముల జాబితా కొత్తగా తీసుకొచ్చింది కాదని.. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఈ జాబితా అమల్లోకి వచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగినప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వ్యవహారాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు.

ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వర్షాకాల సమావేశాలను ఉపయోగించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

సభలో జరిగిన ఘటనలపై ఆగ్రహం

అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా బీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అహంకారం తగ్గలేదని విమర్శించారు.

పోలీసులు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారని అన్నారు. మహిళా అధికారుల సమక్షంలో అనుచితంగా ప్రవర్తించడం, స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలను సీఎం ప్రస్తావించారు. ఈ పరిణామాలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నిర్వహించిన నిరసనపై బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరించిన తీరును కూడా రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు.

‘ఎస్‌ఐఆర్‌ను సీరియస్‌గా తీసుకోండి’

ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్‌ అంశంపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వయోజన జనాభా, ఓటర్ల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉందని పేర్కొంటూ.. దేశంలో కోట్లాది ఓట్లు గల్లంతయ్యే పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడే అంశాన్ని పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు.

కొత్త ఎమ్మెల్యేలకు కీలక సూచన

ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఒక్కసారి గెలిచిన నేతలుగా మిగిలిపోకూడదని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకునేలా పనిచేసి మరోసారి విజయం సాధించి సీనియర్‌ నేతలుగా ఎదగాలని అన్నారు.

ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

కులగణనపై కేంద్రంపై ఒత్తిడి

తెలంగాణలో నిర్వహించిన కులగణనను నమూనాగా తీసుకుని దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణనను కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను అసెంబ్లీ వేదికగా బలంగా వినిపించాలని పార్టీ నేతలకు సూచించారు.

నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. పలు ప్రాంతాల్లో ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు రక్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.

విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరిగిందని, ప్రతిరోజూ భారీ స్థాయిలో విద్యుత్‌ వినియోగం జరుగుతోందని చెప్పారు. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయాలన్నా కొన్ని సందర్భాల్లో అందుబాటులో లేకపోతున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ

వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల అంశాలపై కూడా చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here