మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరమని అన్నారు. జగన్ ఆరోపణలకు కౌంటర్‌గా శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో వీడియోను విడుదల చేసిన లోకేశ్.. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
.@ysjagan, try and stop me!#DSCFakesByYCP #JaganAgainstTeachers #PsychoFekuJagan pic.twitter.com/rnzozD7wZx
— Lokesh Nara (@naralokesh) September 10, 2026
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న తేడా జగన్‌కు తెలుసా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకాలలో డీఎస్సీ కూడా ఉందని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని లోకేశ్ తెలిపారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.
డీఎస్సీని అడ్డుకునేందుకు 300 కేసులు
మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు దాదాపు 300 కేసులు వేశారని నారా లోకేశ్ ఆరోపించారు. అయితే ఈ కేసుల విచారణ సందర్భంగా కోర్టులు ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదని అన్నారు. డీఎస్సీకి సంబంధించి జగన్ చేస్తున్న ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారని లోకేశ్ స్పష్టం చేశారు.
టీచర్లపై ఎలాంటి ఒత్తిళ్లు, దాడులు జరిగినా ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. ఉపాధ్యాయుల గౌరవం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.
త్వరలో మరో డీఎస్సీ
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తామని నారా లోకేశ్ తెలిపారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. యువతకు, నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
చంద్రబాబు అరెస్టుపైనా లోకేశ్ వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 53 రోజుల పాటు జైలులో ఉంచారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు మూడేళ్ల పాటు సాగిన న్యాయ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.
ఈ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ వచ్చిందని లోకేశ్ తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గతంలో చంద్రబాబుపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.
జగన్ చేస్తున్న విమర్శలకు వాస్తవాలతో సమాధానం ఇస్తామని, ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాలు, విద్యారంగ సంస్కరణలను ప్రజలకు వివరిస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.






































