భారత క్రీడా రంగంలో వరుసగా నమోదైన అద్భుత విజయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్చరీ, పారా స్విమ్మింగ్, మహిళల క్రికెట్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, జట్లను అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సాధిస్తున్న విజయాలు దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
మెక్సికోలోని సాల్టిల్లో వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్-2026లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ధీరజ్ బొమ్మదేవరను వారు అభినందించారు. ఈ విభాగంలో ప్రపంచకప్ ఫైనల్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా ధీరజ్ చరిత్ర సృష్టించడం దేశానికే గర్వకారణమని అన్నారు. ధీరజ్ అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో పాటు నిరంతర సాధనకు ఈ విజయం నిదర్శనమని కొనియాడారు. భవిష్యత్తులోనూ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు అభినందనలు తెలియజేస్తున్నాను. ధీరజ్ గెలుపు ఆంధ్రప్రదేశ్ క్రీడా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్చర్… pic.twitter.com/rM5HlVZBG2
— Lokesh Nara (@naralokesh) September 14, 2026
మరోవైపు పారా స్విమ్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బలగ గణేష్ మాస్టర్ అరుదైన ఘనత సాధించడంపైనా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రశంసలు కురిపించారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు విస్తరించిన బోడెన్సీ సరస్సులో 12 కిలోమీటర్ల దూరాన్ని వెట్‌సూట్ లేకుండా కేవలం 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన గణేష్ మాస్టర్‌ను అభినందించారు. గతంలో స్వెన్ ఎకార్డ్ పేరిట ఉన్న 5 గంటల 33 నిమిషాల రికార్డును అధిగమించడం అసాధారణ విజయమని పేర్కొన్నారు.
భళా బలగ గణేష్ మాస్టారు..
జర్మనీ నుండి స్విట్జర్లాండ్ వరకు ఉన్న 12 కిలోమీటర్లు బోడెన్సీ సరస్సును వెట్‌సూట్ లేకుండా ఈదిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పారా స్విమ్మర్‌గా అనితర సాధ్యమైన రికార్డు సృష్టించిన డీఎస్సీ 2025 విజేత బలగ గణేష్ మాస్టారికి హృదయపూర్వక అభినందనలు. జర్మనీకి చెందిన… pic.twitter.com/nwWpKQcvga
— Lokesh Nara (@naralokesh) September 14, 2026
ప్రతికూల పరిస్థితులను అధిగమించి గణేష్ మాస్టర్ చూపిన పట్టుదల, కఠోర శ్రమ ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో టీచర్‌గా ఎంపికైన గణేష్ మాస్టర్.. మరోవైపు పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఇక 2026 వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్ (టీ20) టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు కూడా మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి ఎనిమిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడం భారత మహిళల క్రికెట్ జట్టు ప్రతిభకు నిదర్శనమన్నారు.
వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్(టీ20) 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు.. మన ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన శ్రీ చరణి అద్భుతమైన బౌలింగ్‌తో 4 వికెట్లు తీసింది. అద్భుతమైన ఆట తీరు, బృందస్ఫూర్తితో ఫైనల్ గెలిచి 8వ సారి విజేతగా నిలిచారు..#womensasiacup pic.twitter.com/z81RoqevCN
— Lokesh Nara (@naralokesh) September 14, 2026
ఈ విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి కీలక పాత్ర పోషించారని మంత్రి పేర్కొన్నారు. అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి ఆమె అందించిన సహకారాన్ని ప్రశంసించారు. భారత మహిళల జట్టు ప్రదర్శించిన బృందస్ఫూర్తి, సమష్టి కృషి దేశంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నారా లోకేశ్ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడా ప్రతిభ మరింత వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.



































