ఆ పరిస్థితి వస్తే.. నేరుగా పవన్ అన్నకే ఫోన్ చేస్తా – మంత్రి నారా లోకేష్

Minister Nara Lokesh Confirms TDP-BJP-JSP Alliance Will Continue For 2029 Elections

వచ్చే ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) కలిసే పోటీ చేస్తాయని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ఆయన తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ వేదికగా ఆయన పొత్తులపై కీలక ప్రకటన చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2029 ఎన్నికల్లోనూ కూటమి పొత్తు కొనసాగింపు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బంధం రాబోయే రోజుల్లో మరింత బలంగా కొనసాగుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ మూడంచెల కూటమి కలసే పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఏ మూల ఏ ఎన్నికలు వచ్చినా ఎన్డీయే కూటమి జెండానే ఎగరాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మద్దతు – వైఎస్సార్సీపీ నాయకులకు హెచ్చరిక

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు ఉపయోగిస్తున్న అనుచిత భాష, సోషల్ మీడియా వేధింపులపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ మహిళలను గౌరవించే సంస్కృతి కలిగిన పార్టీ అని పునరుద్ఘాటించారు. ప్రజాసేవ చేయాలనే స్వచ్ఛమైన ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంతి రెడ్డి వంటి మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహిళల జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ప్రజాసేవే ధ్యేయంగా వేమిరెడ్డి దంపతులు

డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయని, అయితే తమ వద్ద ఉన్న సంపదతో ప్రజలకు సేవ చేయాలనే గొప్ప ఆలోచనతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని నారా లోకేష్ కొనియాడారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలు, కుట్రలను తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here