మన దేశం ఆయుష్మాన్ భారత్‌గా మారుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. శనివారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 9 క్రిటికల్ కేర్ యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మొత్తం 22 ప్రాజెక్టుల కోసం రూ.249 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నాయకత్వంలో దేశవ్యాప్తంగా వైద్య రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని చంద్రబాబు అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తోందని తెలిపారు. అర్హత ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం అందుతోందని పేర్కొన్నారు.
దేశంలో వైద్య విద్యకు సంబంధించిన సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని సీఎం వివరించారు. గతంలో 51 వేలుగా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరుకున్నాయని తెలిపారు. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయనున్న సంజీవని ప్రాజెక్ట్ వైద్య రంగంలో గేమ్‌చేంజర్‌గా నిలవబోతోందని చంద్రబాబు చెప్పారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని సీఎం అన్నారు. అదే సమయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను కూడా అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. అమరావతి పేరు లద్దాఖ్ వరకు వినిపిస్తోందని పేర్కొన్న చంద్రబాబు.. భవిష్యత్ సాంకేతికతలో అమరావతి కీలక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతిని కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.








































