పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Says, Telangana Will Build Modern State With the Spirit of Its History

‘తెలంగాణకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది, ఆ చరిత్రను మరిచిపోం.. చరిత్ర దగ్గరే ఆగిపోం. ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధులకు నివాళులర్పించారు.

అనంతరం ప్రసంగిస్తూ.. తెలంగాణ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని సీఎం పేర్కొన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చినప్పటికీ.. అదే సమయంలో ప్రజలు దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతలను ఎదుర్కొన్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పాలనలో చివరి దశలో రజాకారుల దౌర్జన్యాలు తీవ్రరూపం దాల్చాయని అన్నారు.

1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని తెలిపారు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం వెనుక ప్రజల హక్కులు, ఆత్మగౌరవం ప్రధాన అంశాలని సీఎం అన్నారు. ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

రైతు సంక్షేమానికి భారీగా నిధులు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని తెలిపారు. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం గణనీయమైన నిధులు వెచ్చించిందని చెప్పారు.

రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడం ద్వారా 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని సీఎం వెల్లడించారు. రైతు భరోసా పథకం ద్వారా రూ.36 వేల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గత 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి కలిపి రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఉచిత విద్యుత్, సబ్సిడీ వంటగ్యాస్ వంటి సంక్షేమ పథకాల అమలును కూడా సీఎం ప్రస్తావించారు. 53 లక్షలకు పైగా కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు.

రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలపై ప్రకటనలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను చేపట్టినట్లు పేర్కొన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని సీఎం అన్నారు. ఇప్పటివరకు 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసినట్లు వెల్లడించారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యా రంగంలోనూ కొత్త మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మెట్రో విస్తరణ.. మూసీ పునరుజ్జీవనం

హైదరాబాద్ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. సుమారు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు.

మూసీ నదీ పునరుజ్జీవనానికి సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఫ్యూచర్ సిటీపై భారీ ప్రణాళిక

తెలంగాణను భవిష్యత్‌లో దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం అన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని సీఎం ప్రకటించారు.

తెలంగాణ తన గత పోరాట చరిత్రను గౌరవిస్తూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్రను మరచిపోకుండా.. చరిత్రలోనే నిలిచిపోకుండా పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here