ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారాణసీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వం, దేశ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్న సీఎం చంద్రబాబు.. మోదీ నాయకత్వాన్ని చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. ప్రధాని జన్మదినాన్ని వారాణసీ వంటి ఆధ్యాత్మిక నగరంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా రాబోయే 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ తన వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధితో పాటు సేవా భావం, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు
అంతకుముందు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వారాణసీ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర నేతలతో కలిసి ప్రత్యేక పూజలు, ప్రార్థనల్లో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు.
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के जन्मदिन के अवसर पर केंद्रीय रक्षा मंत्री श्री @rajnathsingh उत्तर प्रदेश के मुख्यमंत्री श्री योगी आदित्यनाथ, आंध्र प्रदेश के मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू, केंद्रीय मंत्री चिराग पासवान एवं उत्तर प्रदेश के भाजपा अध्यक्ष श्री पंकज चौधरी ने… pic.twitter.com/zq8mydcbZx
— BJP (@BJP4India) September 17, 2026
‘సేవా సంకల్ప్ అభియాన్’లో చంద్రబాబు
ప్రధాని మోదీ ప్రజా జీవితంలోని 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. వారాణసీలోని రుద్రాక్ష ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ‘వారాణసీ-వాద్నగర్ సేవాయాత్ర’కు శ్రీకారం చుట్టారు.
సేవాయాత్రలో భాగంగా నిర్వహించే బైక్ ర్యాలీ కార్యక్రమానికి కూడా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ప్రధాని మోదీ రాజకీయ, ప్రజా జీవితంలో సేవా భావానికి ప్రాధాన్యత ఇచ్చారని నేతలు పేర్కొన్నారు.
ఎన్డీయే నేతలతో భేటీలు
వారాణసీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలను కలిశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులతోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాల నేపథ్యంలో వారాణసీలో పర్యటించిన చంద్రబాబు.. దేశాభివృద్ధి, జాతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ మరింత బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.





































