భారత సెమీకండక్టర్ రంగంలో కీలక ముందడుగు పడింది. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న ‘సెమీకాన్ ఇండియా 2026’ (SEMICON India 2026)ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సు ‘Silicon to Systems: Building the Ecosystem’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.
‘సిలికాన్ టు సిస్టమ్స్’ దిశగా భారత్
సెమీకండక్టర్ రంగంలో భారత్ తన ప్రయాణాన్ని తదుపరి దశకు తీసుకెళ్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు చిప్ డిజైన్, పరిశోధన, టెస్టింగ్ వంటి విభాగాల్లో ఏర్పడిన సామర్థ్యాలను మరింత విస్తరించి.. తయారీ, ప్యాకేజింగ్, మెటీరియల్స్, పరికరాలు, పరిశోధనతో కూడిన సమగ్ర ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తదుపరి లక్ష్యమని వివరించారు.
ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం Semicon 2.0కు రూ.1,27,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. చిప్ డిజైన్‌తో పాటు సెమీకండక్టర్ తయారీ, అధునాతన ప్యాకేజింగ్, తయారీ పరికరాలు-మెటీరియల్స్, పరిశోధన, ప్రతిభావంతుల అభివృద్ధి వంటి కీలక రంగాలపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తోంది.
12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం
భారత్‌లో సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరు రాష్ట్రాల్లో 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, వాటిలో రూ.1.64 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి నిబద్ధతలు ఉన్నాయి.
దీంతో భారత్ కేవలం చిప్ డిజైన్ లేదా అసెంబ్లీకి మాత్రమే పరిమితం కాకుండా.. సెమీకండక్టర్ విలువ గొలుసులో మరిన్ని దశల్లో తన సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
గ్లోబల్ సప్లై చైన్‌లో కీలక పాత్ర
సెమీకండక్టర్లు ఆధునిక ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్స్, కమ్యూనికేషన్, రక్షణ సహా అనేక రంగాలకు కీలకమైనవిగా మారాయి. ఈ నేపథ్యంలో విశ్వసనీయమైన, స్థిరమైన గ్లోబల్ సప్లై చైన్ నిర్మాణంలో భారత్ పాత్రను పెంచుకోవడంపై సెమీకాన్ ఇండియా 2026లో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.
యశోభూమిలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సెమీకండక్టర్ మెటీరియల్స్, తయారీ, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, డిజైన్, ఎలక్ట్రానిక్స్, సిస్టమ్స్ వరకు మొత్తం విలువ గొలుసును ప్రదర్శిస్తున్నారు. స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాలు కూడా ఈ సదస్సులో భాగంగా ఉన్నాయి.
యువతకు టెక్నాలజీ అవకాశాలు
భారత్ సెమీకండక్టర్ రంగంలో దీర్ఘకాలిక సామర్థ్యాన్ని నిర్మించేందుకు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే దేశంలోని వందలాది విద్యాసంస్థలు, స్టార్టప్‌లు చిప్ డిజైన్‌కు సంబంధించిన వనరులు, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. PIB ప్రకారం, ChipIN Centre ద్వారా 500కు పైగా సంస్థలు, 400 విద్యాసంస్థలు, 100 స్టార్టప్‌లకు డిజైన్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న సెమీకాన్ ఇండియా
మూడు రోజుల పాటు జరిగే సెమీకాన్ ఇండియా 2026లో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 150కి పైగా స్పీకర్లు, అంతర్జాతీయ సంస్థలు, దేశాలు-రాష్ట్రాల ప్యావిలియన్లు, స్టార్టప్ షోకేస్, స్టూడెంట్ హ్యాకథాన్, వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
సెమీకండక్టర్ రంగంలో డిజైన్ నుంచి తయారీ, ప్యాకేజింగ్, సిస్టమ్స్ వరకు విస్తృత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే భారత్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో SEMICON India 2026ను దేశ చిప్ ఎకోసిస్టమ్ తదుపరి దశను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి.






































