ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక భేటీ

CM Revanth Reddy Meets Jal Shakti Minister CR Patil To Secure Maharashtra Nod For Tummidihatti

తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అవసరమైన అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టుల అంశాలను చర్చించారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్లపై దృష్టి

తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా కేంద్రం చొరవ తీసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ స్థాయిలో నిర్మాణం జరిగితే ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంటుందని, తద్వారా విద్యుత్‌ వినియోగం, పంపింగ్‌ వ్యయం తగ్గుతాయని వివరించారు. మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు.

ఇతర ప్రాజెక్టులకూ అనుమతులు

పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ సాగర్‌, గౌరవెల్లి ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ అనుమతులను వేగవంతం చేయాలని సీఎం కోరారు. సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి అవసరమైన ఎన్‌ఓసీ కోసం చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.

టెలీమెట్రీ వ్యవస్థపై విజ్ఞప్తి

కృష్ణా జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో టెలీమెట్రీ పరికరాల ఏర్పాటును వేగవంతం చేయాలని రేవంత్‌ కోరారు. తొలి దశకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here