ట్రూ-అప్‌ ఛార్జీలకు టీజీఈఆర్‌సీ ఆమోదం.. తెలంగాణలో పెరగనున్న కెరెంటు బిల్లులు

TGERC Clears Rs.7,635 Cr True-Up Charges For Telangana Discoms

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. విద్యుత్‌ కొనుగోలు వ్యయం, రాబడి లోటును సర్దుబాటు చేసేందుకు డిస్కమ్‌లు ప్రతిపాదించిన రూ.7,635 కోట్ల ‘ట్రూ-అప్‌’ ఛార్జీల వసూలుకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (TGERC) ఆమోదం తెలిపింది. దీంతో నవంబర్‌ నుంచి వినియోగదారులు అదనంగా ట్రూ-అప్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ట్రూ-అప్‌ ఛార్జీల వసూలు నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలతో ప్రారంభం కానుంది. అంటే 100 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి సాధారణ బిల్లుకు అదనంగా రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ నుంచి ఈ భారం యూనిట్‌కు 50 పైసలకు పెరగనుంది. 100 యూనిట్ల వినియోగానికి రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం రూ.7,635 కోట్ల ట్రూ-అప్‌ మొత్తంలో రూ.2,215 కోట్లను ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సబ్సిడీ కింద భరించనుంది. మిగిలిన రూ.5,420 కోట్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో 29 నెలల పాటు, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో 26 నెలల పాటు ఈ ట్రూ-అప్‌ ఛార్జీలను వసూలు చేయనున్నారు. అంటే ఒక్కసారి కాకుండా నిర్దిష్ట కాలవ్యవధిలో వినియోగదారుల బిల్లుల్లో ఈ అదనపు ఛార్జీలు కొనసాగనున్నాయి.

ట్రూ-అప్‌ ఛార్జీల విషయంలో పారదర్శకత పాటించాలని TGERC ఆదేశించింది. ప్రతి నెల జారీ చేసే విద్యుత్‌ బిల్లులో ఆర్థిక సంవత్సరం, వినియోగించిన యూనిట్లు, వర్తించే రేటుతో పాటు ట్రూ-అప్‌ ఛార్జీలను ప్రత్యేక లైన్‌ ఐటమ్‌గా స్పష్టంగా చూపించాలని సూచించింది. దీంతో వినియోగదారులు తమ బిల్లులో అదనంగా ఎంత మొత్తం వసూలవుతోందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here