రాష్ట్రంలో ఎల్‌నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని, రాబోయే జూలై వరకు కరవు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ జిల్లా అధ్యక్షులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తాగునీటికి మినహా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని, ప్రజలందరినీ ముందుగానే అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ విపత్కర వాతావరణ పరిస్థితులు వచ్చే ఏడాది జూలై వరకు ఉండే అవకాశం ఉన్నందున, అధికారులు మరియు ప్రజలు నీటి వనరులు, విద్యుత్ వినియోగంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో రైతులు వరి వంటి నీటిని ఎక్కువగా కోరే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగు వైపు మళ్లాలని కోరారు. పంటలు వేయకపోయినా ఉపాధి హామీ కింద ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
అలాగే, విద్యుత్ రంగంపై పడుతున్న అదనపు భారాన్ని అధిగమించడానికి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి విద్యుత్‌ను పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సీజన్‌లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, రాష్ట్రంలో ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పశువుల కోసం త్రాగునీరు, దాణా ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సీఎం పార్టీ శ్రేణులకు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం వెనుక పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తి ప్రాంతానికి దూరంగా ప్లాంటును నిర్మించడం వల్ల ప్రజలపై వేల కోట్ల అదనపు భారం పడుతోందని విమర్శించారు. కరవు పరిస్థితులపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులను కోరారు.








































