సుప్రీంకోర్టులో సీఈసీ అఫిడవిట్.. నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనని స్పష్టత

ECI Files Counter-Affidavit in Supreme Court, Clarifies No Amendments Made To Form 6

దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (Special Intensive Revision – SIR) మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) నిర్ణయాధికారాలపై దాఖలైన పిటిషన్లపై భారత ఎన్నికల సంఘం (ECI) సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. 2025 మరియు 2026 వ్యవధిలో జారీ చేసిన మూడు ముఖ్యమైన సర్ ఉత్తర్వులన్నీ ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని ఎన్నికల సంఘం అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది.

సీఈసీ ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా వ్యవహరించారంటూ వచ్చిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ‘ఫారం-6’ (Form 6)లో ఎలాంటి చట్టబద్ధమైన మార్పులు చేయలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. ఫారం-6లో సవరణలు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ కోసం జత చేసిన అదనపు డిక్లరేషన్ పత్రం కేవలం ప్రత్యేక నిర్ధారణ పత్రం మాత్రమేనని వివరించారు.

కమిషన్‌లోని సభ్యుల మధ్య అంతర్గతంగా జరిగే అభిప్రాయ సేకరణ, సాంకేతిక సమాచార మార్పిడి సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని, వాటిని వ్యతిరేకతలుగా భావించలేమని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నమోదు మరియు తొలగింపుల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, ఈఆర్‌వో (ERO) ఆదేశాలు లేకుండా ఎవరి పేరునూ ఓటర్ల జాబితాలో చేర్చడం కానీ, తొలగించడం కానీ సాధ్యపడదని ఈసీ స్పష్టం చేసింది.

పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా దాఖలైన పిటిషన్లలో ఎలాంటి న్యాయబద్ధమైన ఆధారాలు లేవని, చట్టపరిధికి లోబడే కమిషన్ ఈ కీలక నిర్ణయాలన్నీ తీసుకుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో నివేదించారు.

కమిషన్ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోందని, ఓటర్ల నమోదు ప్రక్రియలో పారదర్శకత మరియు చట్టబద్ధత కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు జరపబోయే విచారణ దేశవ్యాప్తంగా రాజకీయ మరియు రాజ్యాంగ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here