తీవ్ర తుఫాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం సహాయ హస్తం అందించింది. ఏపీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను పంపించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చేసిన విజ్ఞప్తికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం ఏపీకి సహాయక బృందాలను పంపించాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్, NPDCL సీఎండీ వరుణ్ రెడ్డిని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్ తక్షణ చర్యలు చేపట్టి విద్యుత్ సిబ్బందితో కూడిన బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపించారు.
తుఫాను ప్రభావంతో ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు సమాచారం. వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతులతో పాటు సరఫరాను తిరిగి పునరుద్ధరించే పనుల్లో తెలంగాణ బృందాలు సహకరించనున్నాయి.
ప్రకృతి విపత్తు సమయంలో ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఏపీకి సహాయం అందించడం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సోదరభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. విద్యుత్ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఈ సహాయక చర్యలు దోహదపడనున్నాయి.






































