దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో పారిశ్రామిక రంగానికి అపూర్వమైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలు ఎలాంటి సంకోచం లేకుండా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు మరియు వారి పెట్టుబడులకు తానే స్వయంగా సంరక్షకుడిగా ఉంటానని సీఎం భరోసా కల్పించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్‌కు పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించిన సీఎం, వ్యాపార విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విధానపరమైన మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలు తమ మనసులో అనుకున్న పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయాలని, ఆశించిన దానికంటే రెట్టింపు లాభాలను సాధించాలని సూచించారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి స్పీడ్‌బ్రేకర్లు లేకుండా, అభివృద్ధికి అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించడమే ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై వస్తున్న సందేహాలను ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, కేంద్రంతో కలిసి సఖ్యతతో ముందుకు వెళ్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
హైదరాబాద్ నగరం కేవలం దేశీయ నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి అంతర్జాతీయ మహాసముద్ర నగరాలతో పోటీపడే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర డీఎన్‌ఏలోనే సంస్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక తత్వం ఉందని, గ్లోబల్ లీడర్లను తయారు చేసిన ఘనత హైదరాబాద్‌కు ఉందని కొనియాడారు. ఈ సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.









































