ఈవీఎంలైతే ట్యాంపరింగ్ అంటారు.. బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ అంటారు, ఇంకెలా? సీఎం చంద్రబాబు

CM Chandrababu Says, Alliance Performed in Local Polls Better Than 2024 Elections

ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాలకు గాను 27 జిల్లాల్లో ప్రజల మద్దతు కూటమికేనని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన నేడు తాజాగా ముగిసిన పరిషత్ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగితే ట్యాంపరింగ్ అంటున్నారని.. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే రిగ్గింగ్ అంటున్నారని.. ఇంకెలా నిర్వహించాలని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయాన్ని అందించిన ఓటర్లకు, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలు తమ రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన గౌరవమని అభివర్ణించారు.

2024 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు

2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి కూటమికి మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 55.30 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 39.81 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. తాజా స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం 58.90కు పెరిగిందని, వైసీపీ ఓట్ల శాతం 33.56కు తగ్గిందని పేర్కొన్నారు. ఈ గణాంకాలు ప్రజలు తమ పాలనపై ఎలా స్పందించారో స్పష్టంగా తెలియజేస్తున్నాయని అన్నారు.

పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కూటమి ఆధిపత్యం కొనసాగిందని సీఎం తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి 59.9 శాతం ఓట్లు, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయని వివరించారు. పరిషత్ ఎన్నికల్లోనూ కూటమికి గణనీయమైన ఆధిక్యం లభించిందన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచాయని, ప్రజలు ఇచ్చిన మద్దతును అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో తిరిగి అందిస్తామని స్పష్టం చేశారు.

575 జడ్పీటీసీ, 7,803 ఎంపీటీసీ స్థానాల్లో విజయం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 7,803 స్థానాలు గెలుచుకుందని తెలిపారు. 659 జడ్పీటీసీ స్థానాల్లో 575 స్థానాలను కూటమి సాధించిందన్నారు. మొత్తం 28 జిల్లాల్లో అల్లూరి జిల్లా మినహా 27 జిల్లాల్లో కూటమికి మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు.

జడ్పీటీసీ ఎన్నికల్లో అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదని చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, పరిషత్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. ప్రజలు కూటమి వైపు నిలవడం ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరిస్తూ పరిపాలన సాగిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి తాజా ఎన్నికల ఫలితాలే సాక్ష్యమని పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్లలోనూ కూటమికి ఆధిక్యం

ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా కూటమికి మద్దతు తెలిపారని సీఎం వివరించారు. పోస్టల్ బ్యాలెట్లలో కూటమికి 65.70 శాతం ఓట్లు, వైసీపీకి 27.42 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. బ్యాలెట్ ఓటింగ్‌పై కూడా వైసీపీ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. తుపాన్ల సమయంలోనూ ఎన్నికల కంటే ప్రజల భద్రతకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, సుపరిపాలనకు ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు.

స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, పోలీసు శాఖకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా భావించి, మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here