కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టు మరియు కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌లో అత్యంత బలమైన, సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రాల వారీగా నీటి పంపిణీకి సంబంధించి సెక్షన్-3ని సవాలు చేస్తూ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణతో పాటు, ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ట్రైబ్యునల్ విచారణలో తెలంగాణ హక్కులు దెబ్బతినకుండా పక్కా ఆధారాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి న్యాయ నిపుణులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఎలాంటి చిన్న తప్పిదానికి తావులేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే ఎత్తిపోసే పరిస్థితి లేనందున, అదనపు టీఎంసీ పనుల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం మార్గదర్శనం చేశారు. కేంద్ర జల సంఘం (CWA) నుంచి అన్ని రకాల అనుమతులు పొందడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయడం, భూసేకరణ వేగవంతం చేయడంపై దృష్టి పెట్టాలన్నారు.
మరోవైపు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి సమాంతర కెనాల్ తవ్వి, డిండి మరియు అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు 0.6 టీఎంసీల నీటిని తరలించే పనులను నూతన సాంకేతికతతో వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇదే సమయంలో, హైదరాబాద్ మియాపూర్‌లో విలువైన 500 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంలో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి, ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానికి దక్కేలా చేసిన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అదే పట్టుదల మరియు స్ఫూర్తితో కృష్ణా జలాల కేసుల్లో కూడా వాదనలు వినిపించి రాష్ట్రానికి న్యాయమైన వాటా దక్కేలా చూడాలని కోరారు.
ఈ భేటీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంబో కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీలు రమేష్ బాబు, మధుసూదన్ రావులతో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.








































