అసెంబ్లీలో చెప్పినట్టే.. హీరో నాగార్జునకు సన్మానం చేసాం – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Praises Hero Nagarjuna During Inauguration of Restored Thammidikunta Lake in Madhapur

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో సుందరీకరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. శిల్పారామం సమీపంలో కబ్జాలు, మురుగునీరు, చెత్తాచెదారంతో కేవలం 14 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును, సుమారు రూ. 1,200 కోట్ల విలువైన ఆక్రమణలను తొలగించి తిరిగి 30 ఎకరాలకు విస్తరించినట్లు సీఎం తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీ నటుడు నాగార్జున నిజ జీవితంలోనూ హీరోలా వ్యవహరించారని, తమ్మిడికుంటలో తనకు చెందిన రెండెకరాల స్థలాన్ని చెరువు అభివృద్ధికి ప్రభుత్వానికి రాసిచ్చారని గుర్తుచేశారు. అందుకే ఆయనకు అసెంబ్లీలో చెప్పినట్టే ఘనంగా సన్మానం చేసి, అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువును ఆయనతోనే ప్రారంభించామని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఐటీ కారిడార్ మధ్యలో ఉన్న ఈ చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు దుర్వాసన, చెత్త కుప్పలతో నిండిన ఈ ప్రాంతం ఇప్పుడు అత్యంత ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మారింది. ఇప్పుడు ఈ చెరువును చూస్తే.. ఐటీ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం తమ్మిడికుంట’ అంటూ ఇక్కడి నుంచి ఆఫీస్ పని చేసుకోవడానికి ఇష్టపడతారు. నగరంలోని అన్ని చెరువులను ఇలాగే అభివృద్ధి చేసి, ప్రజలు ‘వర్క్ ఫ్రం లేక్స్’ అనే వాతావరణాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించాం” అని స్పష్టం చేశారు.

నగరంలో చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం వెల్లడించారు. కూకట్‌పల్లి నల్లచెరువు, బాతుకమ్మకుంట, బూమ్‌-రుక్నుద్‌-ఉద్‌-దౌలా చెరువుల తరువాత తమ్మిడికుంటను నాల్గవ విజయవంతమైన ప్రాజెక్ట్‌గా ప్రజలకు అంకితం చేశామన్నారు. చెరువు చుట్టూ 1.6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల ఆటస్థలం, పచ్చదనం పెంపొందించేలా ల్యాండ్‌స్కేపింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

అలాగే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మరికొన్ని రోజుల్లోనే పట్టాలెక్కబోతున్నదని, దీనిలో భాగంగా తొలిదశ కింద 21 కి.మీ పరిధిలో డెవలప్‌మెంట్ ప్రక్రియ టెండర్ దశలో ఉంది.త్వరలోనే దీనిని కార్యరూపంలోకి తీసుకొస్తాం. ఎంతటి అడ్డంకులు ఎదురైనా సరే పూర్తి చేసి తీరుతామని, ప్రజలందరూ ఈ బృహత్ ప్రయత్నానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here