కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, వాటిలో ఏ మేరకు క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ అవుతున్నాయో పర్యవేక్షించేందుకు ఏటా ఎంవోయూలపై ఆడిట్ నిర్వహించి వివరాలు వెల్లడిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2026)లో పాల్గొని పలు కీలక విషయాలు పంచుకున్నారు.
ఈ సదస్సుతో పాటు దీనికి సన్నాహకంగా ఐదు ప్రాంతాల్లో నిర్వహించిన సదస్సుల ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ. 9,89,006 కోట్ల భారీ పెట్టుబడులు తరలివచ్చాయని తెలిపారు. విశాఖ సదస్సులో రూ. 9,02,484 కోట్ల విలువైన 109 ఒప్పందాలు కుదరగా, విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి ప్రాంతీయ సదస్సుల ద్వారా రూ. 86,522 కోట్ల విలువైన 194 ఒప్పందాలు జరిగాయి. మొత్తం 303 ఒప్పందాల ద్వారా సుమారు 3.48 లక్షల మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.
ఈ సదస్సుకు 58 దేశాలకు పైగా ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు హాజరుకావడం విశేషం. జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్‌ఫ్రా, డిక్సన్ టెక్నాలజీస్, పంచశీల్ రియాల్టీ, వారీ ఎనర్జీస్, కెయిన్స్ టెక్నాలజీ, స్మాక్స్ డిజిటెక్ వంటి దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ముఖ్యంగా ఏరోస్పేస్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, హైపర్ స్కేల్ డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్టులు, రక్షణ మరియు హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు.
గత రెండున్నరేళ్లలో అంటే 2024 జూన్ నుంచి ఇప్పటివరకు కుదిరిన 714 ప్రాజెక్టుల ఒప్పందాల ద్వారా రూ. 22.60 లక్షల కోట్ల ప్రతిపాదనలు రాగా, తాజా సమిట్ ఒప్పందాలు కూడా కలుపుకుంటే మొత్తం పెట్టుబడుల విలువ రూ. 32.49 లక్షల కోట్లకు చేరుకుంది.
పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వాటిని సంరక్షించడమూ తమ బాధ్యత అని సీఎం చంద్రబాబు భరోసా ఇవ్వడంతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగి, ఏపీని పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.







































