12 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడూ సిద్ధాంతాలు వీడలేదు – ‘సేన ప్రస్థానం’ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP Dy CM Pawan Kalyan Clears National Integrity Tops Party Interests at Sena Prasthanam in Delhi

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సేన ప్రస్థానం… జాతీయ సమగ్రత కోసం’ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, ప్రాంతీయ ఆకాంక్షల సమన్వయం అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు పవన్ కళ్యాణ్ జాతీయ యుద్ధ స్మారకం (నేషనల్ వార్ మెమోరియల్) వద్దకు వెళ్లి దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం జరిగిన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల సదస్సులో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు.. దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప తనకు మరే ఇతర ఆలోచనా లేదని స్పష్టం చేశారు. పార్టీని స్థాపించిన సమయంలో భవిష్యత్తులో అధికారం వస్తుందో, రాదో కూడా తెలియదని.. కేవలం ఆశయాల కోసమే ముందడుగు వేశామని గుర్తుచేశారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాము ఎన్నో పోరాటాలు, పరాజయాలను ఎదుర్కొన్నామని డిప్యూటీ సీఎం పవన్ వివరించారు.

సిద్ధాంతాల పునాది..

ఇంకా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జనసేన తన 7 ప్రాథమిక సిద్ధాంతాలను ఎన్నడూ వదల్లేదని ఏపీ డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో ముందుకు వెళ్లడం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో వంద శాతం విజయం సాధించగలిగామన్నారు. ప్రారంభంలో కేవలం లక్ష మంది సభ్యత్వంతో మొదలైన జనసేన, నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వాలతో బలీయమైన శక్తిగా ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వేల మంది పార్టీలో చేరుతున్నారని, అయితే జనసేనకు పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రత, సార్వభౌమాధికారమే అత్యంత ప్రాధాన్యమని ప్రకటించారు. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం అనేది ఒక్క రోజుతో అయ్యే పని కాదని, దీనిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

రాష్ట్ర విభజనకు ఏనాడూ అడ్డు చెప్పలేదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజనకు జనసేన ఏనాడూ అడ్డు చెప్పలేదని ఏపీ డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన అప్రజాస్వామిక తీరును చూసి మాత్రమే తాము తీవ్ర ఆవేదన వెలిబుచ్చామన్నారు. నాటి కాంగ్రెస్‌ విభజన విధానం తెలుగు ప్రజల మధ్య అసంతృప్తిని, అశాంతిని సృష్టించిందని.. వారి ధోరణి ఇప్పటికీ మారలేదని విమర్శించారు. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న జనసేన సభకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడమే అందుకు సజీవ ఉదాహరణ అని దుయ్యబట్టారు.

ఢిల్లీ మెడలు వంచే నేతలపై కౌంటర్లు

‘ఢిల్లీ మెడలు వంచుతాం.. మా తడాఖా చూపిస్తాం’ అంటూ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పే నేతలు, ఢిల్లీకి రాగానే పూర్తిగా వెనక్కి తగ్గుతారని ఏపీ డిప్యూటీ సీఎం ఎద్దేవా చేశారు. చాలాసార్లు మనకు మనం తక్కువగా అంచనా వేసుకుంటామని, కానీ సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఒక ‘కాక్రోచ్‌ (బొద్దింక) పార్టీ’ ఎలా పుట్టుకొచ్చిందో అందరూ చూస్తున్నారని వ్యాఖ్యానిస్తూ.. ఆ పార్టీని చూస్తే తనకు వేమన రాసిన ‘చలిచీమల’ పద్యం గుర్తుకు వస్తోందని, క్రమశిక్షణ గల చలిచీమలు అనుకుంటే ఎంతటి బలమైన పామునైనా చంపేయగలవని పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

దేశ సమగ్రత.. ప్రతి ఒక్కరిపై బాధ్యత

ప్రాంతీయ అస్తిత్వాన్ని, స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూనే, దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. అన్ని భాషలకు, సంస్కృతులకు సరైన ప్రాధాన్యత ఇస్తూనే జాతీయవాద లక్ష్యాలను ఎలా చేరుకోవాలో వివరించారు. పార్టీ సిద్ధాంతాల పునాదులపైనే జనసేన ప్రస్థానం సాగుతుందని, జాతీయ సమగ్రతకు సవాలుగా మారే శక్తులపై వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిద్ధాంతపరమైన పునాదులతో జాతీయ రాజకీయ పరిణామాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇటీవల తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి పార్టీలో చేరిన పలువురు కీలక మేధావులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సమకాలీన జాతీయ రాజకీయ సవాళ్లు, దేశ భవిష్యత్తు ప్రణాళికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here