సంక్షేమ పథకాలపై క్యాలెండర్ సిద్ధం చేయండి – కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Naidu Directs All District Collectors To Prepare Welfare Calendar

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల రెండో రోజు సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, కులవృత్తుల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమం తదితర అంశాలపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.

సంక్షేమ పథకాలపై క్యాలెండర్

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తున్నారు? లబ్ధిదారులకు ఏ తేదీన ప్రయోజనం అందుతుంది? వంటి వివరాలను ముందుగానే తేదీలతో సహా వెల్లడించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

కులవృత్తులకు వాల్యూ అడిషన్

కులవృత్తులకు సంబంధించి సంప్రదాయ విధానాలకు పరిమితం కాకుండా వాల్యూ అడిషన్ చేసేలా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు సూచించారు. చేనేత, చేతివృత్తుల కేంద్రాలను ఎక్స్‌పీరియన్స్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సంక్షేమ పండుగలు నిర్వహిస్తూ ఆయా వృత్తులకు మార్కెటింగ్, ఆదాయ అవకాశాలు పెంచాలని తెలిపారు.

కాపు కార్పొరేషన్ నిధులపై కీలక సూచన

కాపు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఎక్కడైనా నిధులు వినియోగించకుండా మిగిలిపోయి ఉంటే వాటిని వెంటనే ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. నిధుల కొరత ఉన్న ప్రాంతాల వివరాలను తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘ఫ్యామిలీ మ్యాపింగ్’పై చంద్రబాబు ఆగ్రహం

ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో ఇష్టానుసారంగా పెన్షన్లు, ఇళ్లు కేటాయించడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా చేయడం సరైన విధానం కాదని అన్నారు. ప్రభుత్వ విధానంలో కంబైన్డ్ ఫ్యామిలీ భావనకు ప్రాధాన్యం ఉందని తెలిపారు. పెద్ద కుటుంబాలకు మరింత ప్రయోజనం కలిగేలా విధానాలను రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు.

వక్ఫ్ ఆస్తులపై ప్రత్యేక దృష్టి

వక్ఫ్ బోర్డుకు పెద్ద మొత్తంలో భూములు, ఆస్తులు ఉన్నప్పటికీ వాటి నుంచి వస్తున్న ఆదాయం చాలా తక్కువగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆస్తులను సమర్థంగా వినియోగించుకుని మైనార్టీ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం కల్పించేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

దేవాదాయ శాఖకు వస్తున్న ఆదాయం మాదిరిగానే మైనార్టీ సంక్షేమానికి సంబంధించిన ఆస్తుల నుంచి కూడా ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఉదాహరణగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఒక్కరోజులోనే రూ.7 కోట్ల వరకు ఆదాయం వచ్చిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.

మైనార్టీ వర్గాలు బలహీనంగా ఉన్నాయని, వారి సంక్షేమం కోసం అధికారులు మరింత గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. అందుబాటులో ఉన్న ఆస్తులు, వనరులను సద్వినియోగం చేసుకుని వారికి న్యాయం చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here