డిసెంబర్ 7న విజయవాడలో ‘జయహో బీసీ మహా సభ’, పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ నేతలు, మంత్రులు

Ysr Party Leaders,Ysr Ministers,Jayaho Bc Maha Sabha,Jayaho Bc Maha Sabha Poster,Jayaho Bc Maha Sabha Vijayawada,Jayaho Bc Maha Sabha On December 7,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

డిసెంబర్ 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జయహో బీసీ మహా సభ” నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జయహో బీసీ మహా సభ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు మోపిదేవి వెంకటమణ, సత్యవతి, మార్గాని భారత్, పలువురు పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా జయహో బీసీ మహా సభ-వెనుకబడిన కులాలే వెన్నెముక అన్న నినాదంతో బీసీ మహా సభ పోస్టర్ ను పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు విడుదల చేశారు. దాదాపు 84 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యే ఈ మహా సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కోరారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు ఆయా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ ప్రజాప్రతినిధి తప్పనిసరిగా ఈ సభకు హాజరుకావాలని, ఒకవేళ ఎవరికైనా ఆహ్వానాలు అందకపోయినా, ఇదే ఆహ్వానంగా భావించి సభకు రావాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జయహో బీసీ పేరుతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో భారీ బీసీ మహాసభ నిర్వహిస్తుంది. వెనుకబడిన వర్గాలే వెన్నెముక అన్న నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 7వ తేదీన మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు గ్రామ పంచాయితీల్లోని వార్డు సభ్యుల నుంచి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వారందరూ దాదాపు 84 వేల మంది బీసీ ప్రతినిధులు హాజరుకానున్నారు. 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ మహాసభ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరై ప్రసంగిస్తారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది. రాబోయే కాలంలో ఏం చేయబోతుంది అనేది సీఎం తన ప్రసంగంలో వివరిస్తారు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ పదవులు పొందిన ప్రతి ఒక్క బీసీ ప్రతినిధులను ఈ సభకు ఆహ్వనిస్తున్నాం. ఈ సమావేశాల అనంతరం రీజనల్‌ స్థాయిలో జోనల్‌ సమావేశాలు కూడా నిర్వహిస్తాం. ఆ తర్వాత జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ప్రణాళిక బద్దంగా బీసీ సభలు నిర్వహిస్తాం. జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమం లోపల ఈ సమావేశాలన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించాం. బీసీలే వెన్నెముక అన్న ప్రాతిపదికగా మా పార్టీ, ప్రభుత్వం ముందుకెళుతోంది. ఒక్క రాజ్యసభలోనే వైఎస్సార్సీపీ నుంచి 50 శాతం మంది సభ్యులు బీసీలే ఉన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అత్యున్నత స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క అసౌకర్యం లేకుండా జయహో బీసీ మహా సభను విజయవంతంగా నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అధికారానికి ఒక ఆకారం ఉంటుందా, పదవులు పొందిన బీసీలకు అధికారాలు లేవన్న విమర్శలు హాస్యాస్పదం. అదంతా ఎల్లో మీడియా సృష్టే. ప్రతిపక్షాలు కూడా అలాంటి విమర్శలు చేయడం బీసీలను కించపరచినట్లే అవుతుంది. సమాజంలో అట్టడుగున ఉన్న, అణగారిన వర్గాలకు మా నాయకుడు, సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడమే మా పార్టీ ప్రధాన లక్ష్యం. బీసీ మహాసభ తర్వాత ఎస్సీ, ఎస్టీల సభలు కూడా నిర్వహిస్తాం. ఎవరినో విమర్శించడానికి ఈ బీసీ సభలు పెట్టడం లేదు. విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాది అనే రీతిలో మేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, బాబు ఇదేం ఖర్మ అని తిరుగుతుంటే, జనం చంద్రబాబుకు ఇదేం ఖర్మా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 84 వేల మంది బీసీ ప్రతినిధులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో జయహో బీసీ అంటూ ఒక మహాసభ నిర్వహిస్తుంటే.. టీడీపీ వెన్నులో వణుకుపుడుతుంది. బీసీలను చంద్రబాబు అన్నివిధాలా ముంచాడు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి, సామాజిక న్యాయం చేస్తున్నారు. ఈ సభలో గడిచిన మూడున్నరేళ్ళలో జగన్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది. బీసీలకు ఏం చేస్తామని చెప్పాం.. ఏం చేశాం.. భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నామో కూడా ఈ మహా సభలో చర్చిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, అదిప్ రాజ్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పి రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాప్ రెడ్డి, నవరత్నాల కమిటీ వైఎస్ ఛైర్మెన్ ఏ.నారాయణమూర్తి, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here