ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అత్యంత బలంగా ఉందని, దీనిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను మూడు పార్టీలు ఐక్యంగా ఎదుర్కొని తిప్పికొడతాయని ఏపీ గ్రీన్ ఆంధ్ర ఛైర్మన్, జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన, శుక్రవారం (నవంబర్ 20) ప్రత్తిపాడులో మీడియాతో మాట్లాడారు.
కూటమి విడిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన నాగబాబు, టీడీపీ, జనసేన, బీజేపీలది ఒకే మాట, ఒకే బాట అని పేర్కొన్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సమయంలో చిన్నచిన్న మనస్పర్ధలు రావడం సహజమేనని, ఎన్నికల అనంతరం ఎలాంటి విభేదాలు ఉండవని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ రాజకీయంగా ఎప్పుడో మరణించిన పార్టీ అని, ఆ పార్టీ నేతలు మాత్రం తాము ఇంకా బతికే ఉన్నామనే భ్రమలో తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన మళ్లీ రాకూడదన్న ఏకైక లక్ష్యంతో, రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
రాబోయే మరో 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
అనంతరం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి నాగబాబు స్థానిక మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులు మరియు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతలో కూటమి సాధించిన 100 శాతం విజయాలు అందరికీ స్ఫూర్తిగా నిలిచాయని, అదే సమన్వయం, సమష్టి కృషితో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల విశ్వాసంతో గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి గ్రామాల అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నాగబాబు సూచించారు. అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి పాలనకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.





































