తాను తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డనని, రాష్ట్ర నీటి ప్రయోజనాలకు ఏనాడూ అన్యాయం చేయబోనని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం (నవంబర్ 19) సిద్దిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కృష్ణా జలాల విషయంలో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే 2017లోనే టీడీపీని వదిలేశానని, చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా ఏనాడో తెంచుకున్నానని సీఎం ఉద్వేగంగా చెప్పారు.
ఇదే వేదికపై నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ఆయన ప్రారంభించడంతో పాటు, రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు సహా సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మొత్తం రూ. 544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
దాదాపు 70 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిపించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ప్రణాళిక ఇచ్చి కమీషన్లు పొందింది కేసీఆరేనని, పోతిరెడ్డిపాడు విషయంలో హరీశ్‌రావు వంత పాడారని సీఎం ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి పరిహారం అందించాలని మంత్రి వివేక్, అధికారులకు సూచించారు.
కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత మాజీ మంత్రి అనంతుల మదన్‌మోహన్‌తో పాటు, చంద్రబాబుకు, తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని చెప్పి కాంగ్రెస్‌కు కూడా కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనంతుల మదన్మోహన్ పేరు పెడుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి, ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని వేదికపై ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించారు.
కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని హరీశ్‌రావుకు కాంగ్రెస్ దయతోనే వైఎస్సార్ మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్న రేవంత్‌రెడ్డి, రబ్బరు చెప్పులతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రులకు పాలు సరఫరా చేసే ముకుంద డెయిరీ హరీశ్‌రావుదేనని ఆరోపిస్తూ, వచ్చే ఎన్నికల వరకు ఆయన బీఆర్ఎస్లో ఉండరని, బీజేపీ నేతలతో మంతనాలు సాగించడం లేదని సిద్దిపేట ఎల్లమ్మపై ఒట్టేసి చెబుతారా అని సవాల్ విసిరారు.
మరోవైపు ఆస్తుల పంపకాల విషయంలో సొంత చెల్లెలిని ఇంట్లోంచి గెంటేసిన కేటీఆర్ రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను ఉద్ధరిస్తాడంటే ఎవరూ నమ్మరని, బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారని సీఎం విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ పాలనలో ఒక్క పదవి కూడా ఇవ్వకుండా అవమానించారని, తమ ప్రభుత్వం ఆమెకు పదవి ఇచ్చి గౌరవించిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట గడ్డ ఇక కాంగ్రెస్ అడ్డాగా మారనుందని, వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో గత వారం రోజులుగా బహిరంగంగా విమర్శలు చేస్తున్న సొంత పార్టీ నేతల తీరుపైనా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా, లోపాలను మైకుల్లో మాట్లాడే సొంత పార్టీ నేతల తీరును కార్యకర్తలు అడ్డుకోవాలని ఆయన సూచించారు.







































