పదవీ విరమణ చేసిన ఉద్యోగుల భవిష్య జీవిత భద్రతకు భరోసానిస్తూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని నగదును ఇకపై ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా, అవసరానికి అనుగుణంగా విడతలవారీగా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించే ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’ (SWP)కు ఆమోదం తెలిపింది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన గురువారం (నవంబర్ 19) జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 240వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన విధానం పూర్తిగా ఐచ్ఛికమని (Optional), ఉద్యోగులు తమ సౌలభ్యాన్ని బట్టి దీనిని ఎంచుకోవచ్చని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పీఎఫ్ ఖాతాలో ఉన్న పూర్తి మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోవాల్సి వచ్చేది. ఆ మొత్తాన్ని ఎక్కడ, ఎలా సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనే అంశంపై సరైన అవగాహన లేక అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆమోదించిన ఎస్‌డబ్ల్యూపీ విధానం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించనుంది.
విశ్రాంత ఉద్యోగులు తమ ఖాతాలోని సొమ్మును నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక వాయిదాల రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా అవసరమైన మేరకు నగదు తీసుకుని మిగిలిన సొమ్మును ఖాతాలో ఉంచుకోవడంతో పాటు, కేవలం ఖాతాలో ఉన్న నగదుపై వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
ఖాతాలో మిగిలి ఉన్న నగదుకు ఈపీఎఫ్ఓ నిర్ణయించిన వార్షిక వడ్డీ యథావిధిగా జమ అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సీబీటీ 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబంధనల వల్ల 55 ఏళ్లు దాటి, తమ పీఎఫ్ ఖాతాలో కనీసం రూ. 5 లక్షల నగదు నిల్వ ఉన్న సుమారు 6.32 లక్షల మంది సభ్యులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.
అదనంగా, 55 ఏళ్ల లోపు వయసున్న సభ్యులు కూడా తమ అవసరాల నిమిత్తం ఇకపై 90 శాతం వరకు నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఒకవేళ సభ్యుడు మరణిస్తే, ఖాతాలోని మిగిలిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడమా లేక కొనసాగుతున్న ఎస్‌డబ్ల్యూపీని అలాగే కొనసాగించడమా అన్నది నామినీ నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
అయితే సీబీటీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినప్పటికీ, ఈ సదుపాయం తక్షణమే అమల్లోకి రాదని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు, సాంకేతిక మార్గదర్శకాలను ఈపీఎఫ్ఓ రూపొందించి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే సభ్యులకు ఈ విడతలవారీ విత్‌డ్రా సదుపాయం అందుబాటులోకి రానుంది.








































