స్థానిక ఉగ్రవాదుల నుంచి కశ్మీర్‌కు 35 ఏళ్ల తర్వాత విముక్తి లభించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద కమాండర్ లతీఫ్ భట్ హతమైన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యాంటీ-టెర్రర్ కాన్ఫరెన్స్ 2026’లో గురువారం (నవంబర్ 19) అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బుధవారం (నవంబర్ 18) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లతీఫ్ భట్ మృతి చెందాడు.
ఒక మసీదులో దాక్కున్న ఉగ్రవాదిని లొంగిపోవాలని భద్రతా బలగాలు కోరగా, అతను నిరాకరించి దళాలపై కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లతీఫ్ భట్ హతమయ్యాడు. ఈ ఆపరేషన్ ద్వారా కుల్గాం ప్రాంతంలో భద్రతా దళాలకు పెద్ద విజయం దక్కిందని, దీనిపై తాను హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు.
‘యాంటీ-టెర్రర్ కాన్ఫరెన్స్ 2026’ వేదికగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి.. దేశవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై సమగ్ర దర్యాప్తు జరిపి, మూలాలను పూర్తిగా తుడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు మరియు భద్రతా బలగాలన్నీ ఏకమై సమన్వయంతో పోరాడినప్పుడే ఉగ్రవాదం పూర్తిగా అంతమవుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద విషయంలో తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోందని పునరుద్ఘాటించారు.
విదేశాలకు పారిపోయిన ఉగ్రవాదులను తిరిగి రప్పించే చర్యలను కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందని అమిత్ షా తెలిపారు. 2019 నుంచి ఇప్పటివరకు 36 దేశాల నుంచి పరారీలో ఉన్న 303 మంది ఉగ్రవాదులను భారత్‌కు రప్పించగలిగామని వివరించారు. జాతీయ భద్రత విషయంలో ఎట్టి రాజీ లేదని, అంతర్జాతీయ సహకారంతో ఉగ్రవాదుల కదలికలను కట్టడి చేస్తూ దేశ శాంతి, భద్రతలను కాపాడుతామని హోం మంత్రి స్పష్టం చేశారు.








































