భారత్‌లో వడ్డీ రేట్లు తక్కువ, అయినా 7 శాతం జీడీపీ వృద్ధి – అమెరికా అధ్యక్షుడు ట్రంప్

President Trump Slams US Federal Reserve, Says Look at India, Low Interest Rates and 7% GDP Growth

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న వడ్డీ రేట్ల విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వడ్డీ రేట్ల పెంపుతో ఫెడరల్ రిజర్వ్ తమ దేశాన్ని నాశనం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్ ఆర్థిక పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“భారత్‌ను చూడండి.. అక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో వారి జీడీపీ వృద్ధి రేటు కూడా ఏడు శాతంగా ఉంది” అని ప్రశంసించారు. ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తే అమెరికా జీడీపీ 15 నుంచి 20 శాతానికి చేరుకుంటుందని, తద్వారా అప్పులను మరింత వేగంగా తీర్చగలుగుతామని ట్రంప్ స్పష్టం చేశారు.

ఫెడరల్ రిజర్వ్ రాజకీయ ధోరణితో పనిచేస్తోందని, అందుకే వడ్డీ రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. దేశం ఆర్థికంగా రాణిస్తున్నప్పుడు పరపతి మెరుగుపడుతుందని, అటువంటి సమయంలో వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వడ్డీ రేట్ల పెంపు కారణంగానే అమెరికా ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా నమోదవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వల్లే కొన్ని దేశాలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగాయని, కాబట్టి ప్రపంచంలోనే అత్యంత తక్కువ వడ్డీ రేట్లు అమెరికాలోనే ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరులో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరింది. 2023 తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి కాగా, డిసెంబరులోనూ వడ్డీ రేట్లు మరోసారి పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు, భారత్ విషయానికొస్తే.. అక్టోబరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచడంతో రెపో రేటు 5.50 శాతానికి చేరుకుంది. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణ చర్చల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here