టార్గెట్ వైసీపీ.. అవ‌న్నీ నిజ‌మేనా!

YCP, Jagan, AP, AP Politics, YSRCP, rajya sabha, Meda Raghunadha Reddy, janasena, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Elections, AP CM Jagan Latest News and Live Updates, Mango News Telugu, Mango News
YCP, Jagan, AP, AP Politics

అంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. అధికార పార్టీయే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు ర‌చిస్తుంటే.. సింహం సింగిల్ గానే అంటూ వారిని ఢీ కొట్టేందుకు వైసీపీ ప్ర‌తివ్యూహాలు ప‌న్నుతోంది. అయితే.. జ‌న‌సేన‌, టీడీపీ, కాంగ్రెస్ ఒక్క‌టై చేస్తూన్న‌ ప్ర‌చారాలే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి చేరుతున్నాయి. త‌లోదిక్కున.. త‌లో పార్టీ నుంచి.. త‌లో ఒక‌రు వైసీపీ, ఆ పార్టీ అధినేతపై చేస్తున్న ఆరోప‌ణ‌లు తీవ్ర‌మైన చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ వినియోగించుకునేందుకు విప‌క్షాలు ఎత్తులు వేస్తున్నాయి. జ‌గ‌న్ అవినీతిపైన‌, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌పైన‌, కొంద‌రు వ‌లంటీర్లు చేసిన త‌ప్పుల‌పైన అవి దృష్టి పెట్టి ఫోక‌స్ చేస్తున్నాయి.

అలాగే.. రాబోయే ఎన్నిక‌ల‌కు వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు వెనుక‌డుగు వేస్తున్నారంటూనే.. ఆ పార్టీలో సీటు కోసం రూ. 50 కోట్ల‌కు పైగానే డిమాండ్ చేస్తున్నార‌న్న వ‌దంతుల‌ను వ్యాపింప‌చేస్తున్నారు. రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌ను కూడా ఇప్పుడు ప్ర‌చారానికి వాడుకుంటున్నాయి. రాయలసీమకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈ దఫా టికెట్‌ నిరాకరించారు. సీమలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను రాజ్యసభకు పంపుతామని గ‌తంలో వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చింద‌ట‌.  ఎంపీని అయిపోతానని ఆయన కూడా ఎంతగానో ఆనందించారు. అంతేకాదు.. స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల‌కు కూడా చెప్పుకున్నారు. తీరా చావుకబురు చల్లగా చెప్పారు. రూ.150 కోట్లు  చెల్లిస్తేనే రాజ్యసభకు వెళ్లే అవకాశం లభిస్తుందని ఆయన్ను పిలిపి చెప్పార‌న్న వార్త ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది.

అంత మొత్తం ఇవ్వలేనని ఆయన చేతులెత్తేయడంతో ఆయన్ను పక్కనపెట్టినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రూ.100 కోట్లు సమర్పించుకున్న రెడ్డి సామాజిక వర్గ నేతను ఆయ‌న స్తానంలో ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంపై ఆ ఎమ్మెల్యే ఆక్రోశం వెలిబుచ్చారు. ఎర్రచందనం, ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణాతో సంపాదించిన సొమ్ము తన వద్ద లేదని.. అందుకే అంత ఇవ్వలేనని చెప్పానని ఆంతరంగికుల వద్ద వ్యాఖ్యానించార‌ట‌. కాగా.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను సీఎం జగన్‌ ఖరారు చేశారు. ఎన్నికలు జరిగే మూడు స్థానాలకు టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట (ఎస్సీ) ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు, కాంట్రాక్టరు మేడా రఘునాథరెడ్డి పేర్లను ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన మంచి ముహూర్తం ఉండడంతో.. వారు ఆరోజున నామినేషన్లు వేయ‌నున్నారు. వాస్తవానికి చిత్తూరు సిటింగ్‌ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు టికెట్‌ నిరాకరించిన వైసీపీ నాయకత్వం.. తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు వెల్లడించింది. తర్వాత ఆర్థిక బలాబలాలను బేరీజువేసుకుని.. మేడా రఘునాథరెడ్డిని తెరపైకి తెచ్చింది. మల్లికార్జునరెడ్డికి ఈ దఫా అసెంబ్లీ టికెట్‌ను నిరాకరించి.. ఆయన స్థానంలో ఆకేపల్లి అమరనాథరెడ్డిని ఇన్‌చార్జిగా ప్రకటించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈసారి ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవాలంటే.. ఆర్థికంగా బ‌ల‌మైన నాయ‌కులే అన్ని పార్టీల‌కూ అవ‌స‌రం. అంద‌రూ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. ఒక‌రిపై న‌లుగురు చేస్తున్న ఆరోప‌ణ‌లు అధికంగా ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. టీడీపీ, జ‌న‌సేన, కాంగ్రెస్ చేస్తున్న మూకుమ్మ‌డి విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టేందుకు వైసీపీ ముప్పుతిప్ప‌లు ప‌డుతోంది. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహ‌క‌ర్త‌ల కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఈక్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు మున్ముందు ఎలాంటి మ‌లుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE