ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దర్శనానికి ముందు ఫోన్ డిపాజిట్ తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం భక్తులు క్యూ లైన్లలోకి ప్రవేశించే ముందే తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక మొబైల్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
స్కానింగ్ పాయింట్ వద్ద కొత్త భద్రతా గేట్‌ను ఏర్పాటు చేశారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత కూడా మొబైల్ ఫోన్లు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లకుండా సిబ్బంది కఠినంగా తనిఖీలు చేయనున్నారు.
భద్రత కట్టుదిట్టం
ఆలయ భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఈవో శీనా నాయక్ అధికారులను ఆదేశించారు. హోంగార్డులతో పాటు అజైల్ సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు దర్శన క్యూ లైన్లలో కూడా మార్పులు చేశారు. దర్శన టికెట్ల జారీ కౌంటర్ల స్థానాలను మార్చడంతో పాటు, ఉచిత లడ్డూ ప్రసాదం కౌంటర్లను కూడా కొత్త ప్రదేశాలకు తరలించారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
కొత్తగా చేసిన మార్పులతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలను పాటించి ఆలయ సిబ్బందికి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా.. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్‌లోకి వెళ్లే ముందు మొబైల్ ఫోన్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.








































